
నూర్‌సుల్తాన్ (కజకిస్థాన్): వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ఇండియా టెన్నిస్ టీమ్ పాకిస్థాన్‌తో శుక్రవారం మొదలయ్యే డేవిస్ కప్ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ వేదిక విషయంలో చివరి వరకూ గందరగోళ పరిస్థితులు నెలకొనగా.. రెండు దేశాల టీమ్ సెలెక్షన్స్‌లోనూ విమర్శలు రావడం చర్చనీయాంశమైంది. సెక్యూరిటీపై ఆందోళనతో ఇస్లామాబాద్ వెళ్లబోమని ఇండియా టాప్ పేయర్లు స్పష్టం చేయడంతో మ్యాచ్‌ను తటస్థ వేదికకు మార్చాలని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్)ను ఆలిండియా టెన్నిస్ సంఘం కోరింది. పాక్ టెన్నిస్ సమాఖ్య రివ్యూ అప్పీల్‌ను కొట్టివేస్తూ మరీ ఐటీఎఫ్.. ఈ మ్యాచ్‌ను తటస్ఠ వేదికకు మార్చింది. దీంతో ప్లేయర్ల భద్రతపై అనుమానాలు తొలిగిపోయినప్పటికీ ఆట అంత ఆకట్టుకునేలా జరిగే చాన్స్ కనిపించడం లేదు. ఎందుకంటే సుమిత్ నగల్, రామ్‌కుమార్ రామనాథన్ వంటి టాలెంటెడ్ ప్లేయర్లు, లియాండర్ పేస్ లాంటి వెటరన్‌తో ఇండియా చాలా బలంగా కనిపిస్తోంది. ఈ పోరులో ఏకపక్ష విజయం సాధించేలా ఉంది. మరోవైపు మ్యాచ్‌ను ఇస్లామాబాద్ నుంచి నూర్ సుల్తాన్‌కు మార్చడంతో టాప్ ప్లేయర్లు ఐసమ్ అల్ హక్ ఖురేషి, అకీల్ ఖాన్ టీమ్ నుంచి వైదొలగడంతో పాక్ బలహీనంగా మారింది. గ్రాండ్‌స్లామ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్ల అండ ఇండియాకు ఉండగా.. ఇంకోవైపు కనీసం ఐటీఎఫ్ ఫ్యూచర్స్ లెవెల్లో కూడా సత్తా చాటలేని ప్లేయర్లతో ప్రత్యర్థి డీలా పడింది. కనీసం డబుల్స్‌లో అయినా గట్టి పోరు ఉంటుందని ఆశిస్తే.. ఖురేషి, అకీల్ లేకపోవడంతో అన్ని మ్యాచ్‌లు వన్‌సైడ్‌గా మారే చాన్స్ కనిపిస్తోంది. విజయంపై ఆశలు లేని పాక్ జూనియర్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌తో అనుభవం గడించాలని చూస్తున్నారు. ప్రత్యర్థి బలహీనంగా ఉండడంతో అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గి క్లీన్‌స్వీప్ చేయాలని ఇండియా భావిస్తోంది.
44వ విక్టరీపై పేస్ గురి
ఇండియా లెజెండ్ లియాండర్ పేస్ డేవిస్ కప్‌లో తన విజయాల రికార్డును మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నాడు. డేవిస్ డబుల్స్‌లో రికార్డు స్థాయిలో ఇప్పటికే 43 విజయాలు సాధించిన పేస్.. 44వ విక్టరీపై కన్నేశాడు. 18 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన లియాండర్.. డేవిస్‌లో అరంగేట్రం చేస్తున్న జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి ఆడనున్నాడు. ఫామ్‌లో ఉన్న సుమిత్ నగల్.. డేవిస్‌లో తొలి విజయంపై గురి పెట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (2016లో స్పెయిన్‌పై, 2018లో చైనాపై) నగల్ ఓడిపోయాడు. సింగిల్స్ సెకండ్ ప్లేయర్‌గా రామ్‌కుమార్ పోటీలో ఉన్నాడు. ఇప్పటిదాకా ఎనిమిది డేవిస్ ‘టై’లు ఆడిన అతను ఏడింటిలో గెలిచి, మరో ఏడింటిలో ఓడిపోయాడు. దాంతో, పాక్‌పై నెగ్గి తన రికార్డును మెరుగు పరుచుకోవాలని చూస్తున్నాడు. శుక్రవారం జరిగే ఆరంభ మ్యాచ్‌లో ముహమ్మద్ షోయబ్‌తో అతను పోటీ పడనున్నాడు. 17 ఏళ్ల షోయబ్ ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీల్లో ఇప్పటిదాకా ఒక్క మెయిన్ డ్రా మ్యాచ్ నెగ్గలేకపోవడం గమనార్హం. అలాగే, ఈ ఏడాది అతను ఒక్క సింగిల్స్ మ్యాచ్ కూడా ఆడలేదు. సెకండ్ సింగిల్స్‌లో హుజైఫా అబ్దుల్ రెహ్మాన్‌తో నగల్ పోటీ పడనున్నాడు. జూనియర్ ఐటీఎఫ్ సర్క్యూట్‌లో రాణించిన అబ్దుల్ ఏ మేరకు పోటీ ఇస్తాడో చూడాలి. శనివారం జరిగే డబుల్స్ పోరులో పేస్–-జీవన్ జోడీ.. షోయబ్–-హుజైఫా జంటతో పోటీ పడనుంది. ఆ తర్వాత రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ఉంటాయి. ఒకవేళ వరుసగా మూడు (రెండు సింగిల్స్, డబుల్స్) మ్యాచ్‌లు గెలిచి 3–0తో స్పష్టమైన లీడ్ సాధించినప్పటికీ నాలుగో మ్యాచ్ (రివర్స్ సింగిల్స్–1) ఆడిస్తారు. అప్పటికే ఫలితం తేలిపోతే ఐదో మ్యాచ్‌లో ఆడాలా? వద్దా? అనేది ఇరు జట్ల ఇష్టం.