
ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది 125 వ మ్యాచ్. ఈ ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా షోయబ్ మాలిక్ (124 మ్యాచ్‌లు) రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 3 టీ20ల్లో వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచిన మూడో టీమ్ ఇండియా. ఇది వరకు అఫ్గానిస్తాన్, రొమేనియా ఈ ఘనత సాధించాయి. టీ20ల్లో ఇండియాకు ఇది వరుసగా మూడో క్లీన్‌స్వీప్ విక్టరీ. కివీస్, విండీస్‌లతో సిరీస్‌లనూ క్లీన్‌స్వీప్ చేసింది.
ధర్మశాల: టీ20ల్లో టీమిండియాకు తిరుగే లేదు. ఈ ఫార్మాట్‌లో వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచిన టీమ్‌గా ఇండియా రికార్డు సమం చేసింది. బౌలర్లకు తోడు శ్రేయస్ అయ్యర్ (45 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 73*) హ్యాట్రిక్ ఫిఫ్టీతో దంచికొట్టడంతో ఆదివారం జరిగిన మూడో టీ20లో రోహిత్‌సేన 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. కాంకషన్‌కు గురైన ఇషాన్ సహా నలుగురు ప్లేయర్లను మార్చి రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించినప్పటికీ టీమ్ జోరు ఏమాత్రం తగ్గలేదు. యంగ్ పేసర్ అవేశ్ ఖాన్ (2/23) సూపర్ బౌలింగ్ చేయడంతో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 146/5 స్కోరే చేసింది. ఆ టీమ్ కెప్టెన్ దసున్ షనక (38 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్) సత్తా చాటాడు. ఇండియా బౌలర్లలో అవేశ్‌కు తోడు సిరాజ్ (1/22), హర్షల్ (1/29), బిష్నోయ్ (1/32), కుల్దీప (0/22) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. నిసాంక (1), దనుష్క గుణతిలక (0), చరిత్ అసలంక (4), జనిత్ (9) ఫెయిలవడంతో 29/4 స్కోరుతో కష్టాల్లో పడ్డది. చండిమల్ (22) కాసేపు పోరాడాడు. అయితే, చమిక కురుణరత్నె (12 నాటౌట్)తో ఆరో వికెట్‌కు 47 బాల్స్‌లోనే 86 రన్స్ జోడించిన షనక టీమ్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. అనంతరం ఛేజింగ్‌కు వచ్చిన ఇండియా 16.5 ఓవర్లలో 148/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్లు రోహిత్ (5), సంజూ శాంసన్ (18) ఫెయిలైనా.. వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ ఫామ్ కొనసాగించాడు. దీపక్ హుడా (21), రవీంద్ర జడేజా (22*) సపోర్ట్‌తో టీమ్‌ను గెలిపించాడు. శ్రేయస్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 4న మొహాలీలో మొదలవుతుంది.
స్కోర్లు
శ్రీలంక: 20 ఓవర్లలో 146/5 (షనక 74*, అవేశ్ 2/23, సిరాజ్ 1/22).
ఇండియా: 16.5 ఓవర్లలో 148/4 (శ్రేయస్ 73*, లాహిరు కుమార 2/39).