ఆసియా కప్ ఫైనల్: స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఫేవరేట్ గా శ్రీలంక!

ఆసియా కప్ ఫైనల్: స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఫేవరేట్ గా శ్రీలంక!

ఆసియా కప్ -2023 తుది సమరానికి చేరుకుంది. నేడు జరిగే ఫైనల్ సమరంలో ఆతిధ్య శ్రీలంక జట్టు టీమిండియాతో తలపడబోతుంది.కొలొంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉందని ప్రకటించేశారు. దీంతో ఈ ఫైనల్ కోసం ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదరు చూస్తున్నారు.

ఫేవరేట్ గా శ్రీలంక 
ఆసియా కప్ కి ముందు శ్రీలంక జట్టు ఫైనల్ కి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. భారత్, పాకిస్థాన్ లాంటి బలమైన జట్ల ముందు లంక నిలవడం కష్టమే అనుకున్నారు. పైగా స్టార్ బౌలర్లు కూడా లేకపోవడంతో ఆ జట్టు సూపర్-4 చేరడం కూడా కష్టమన్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందు చేస్తూ ఏకంగా ఫైనల్ కి చేరి భారత్ తో ఢీ కొనబోతుంది. చూడడానికి శ్రీలంక కట్టు బలంగా కనబడకపోయినా  నేడు జరగబోయే ఆసియా కప్ ఫైనల్లో ఆ జట్టే ఫేవరేట్ గా కనబడుతుంది.

ALSO READ: వరల్డ్‌‌ కప్‌‌కు అక్షర్‌‌ డౌట్‌‌!

సొంతగడ్డపై ఆడుతుండడం శనక సేనకు పెద్ద బలం. సొంతగడ్డపై ఆడిన చివరి 14 వన్డేల్లో ఏకంగా 13 విజయాలు సాధించింది. కాబట్టి టీమిండియా లంక జట్టుని తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక సమిష్టిగా రాణించడం ఆ జట్టు ప్రధాన బలం. జట్టులో ఒకరిద్దరిపై ఆధారపడకుండా కలిసి కట్టుగా ఆడుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది.

మరో వైపు భారత్ పేపర్ మీద బలంగా కబడుతున్నా.. బంగ్లాదేశ్ పై ఓటమి ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. ఎప్పుడు ఎవరు ఆడతారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మొత్తానికి కీలకమైన ఫైనల్లో ఒత్తిడిని తట్టుకొని భారత్ టైటిల్ సాధించాలంటే సర్వ శక్తులు ఒడ్డాల్సిందే.