
- 9 వికెట్ల తేడాతో యూఏఈపై గ్రాండ్ విక్టరీ
- రాణించిన దూబే, అభిషేక్, గిల్
దుబాయ్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా.. ఆసియా కప్‌లో బోణీ చేసింది. కుల్దీప్ యాదవ్ (4/7) స్పిన్ మ్యాజిక్‌కు తోడు, శివమ్ దూబే (3/4) దుమ్మురేపడంతో.. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై గ్రాండ్ విక్టరీ అందుకుంది. టాస్ ఓడిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 రన్స్‌కే కుప్పకూలింది. అలీషాన్ షరాఫ్ (17 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 22), ముహ్మద్ వసీమ్ (22 బాల్స్‌లో 3 ఫోర్లతో 19) మినహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. తర్వాత ఇండియా 4.3 ఓవర్లలోనే 60/1 స్కోరు చేసి గెలిచింది.
అభిషేక్ శర్మ (16 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్ (9 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 23 బాల్స్‌లోనే 48 రన్స్ జోడించారు. నాలుగో ఓవర్‌లో అభిషేక్ ఔటైనా, సూర్యకుమార్ యాదవ్ (2 బాల్స్‌లో 1 సిక్స్‌తో 7 నాటౌట్) సిక్స్, గిల్ ఫోర్‌తో ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. కుల్దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.
పెవిలియన్‌కు క్యూ..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈని ఇండియా బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. తొలి రెండు ఓవర్లలో మూడు ఫోర్లతో టచ్‌లో కనిపించిన షరాఫ్.. మూడో ఓవర్‌లో అక్షర్ పటేల్ (1/13) బాల్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో సిక్స్‌గా మలిచాడు. కానీ తర్వాతి ఓవర్‌లో బుమ్రా (1/19).. షరాఫ్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 26 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఐదో ఓవర్‌లోనే బౌలింగ్‌కు దిగిన వరుణ్ చక్రవర్తి (1/4) బాల్‌ను అద్భుతంగా టర్న్ చేస్తూ యూఏఈ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫుల్ ఔట్‌సైడ్ బాల్‌ను సంధించి ముహ్మద్ జోహెబ్ (2)ను ఔట్ చేశాడు. 29/2 వద్ద కెప్టెన్ వసీమ్ ఆరో ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో యూఏఈ 41/2 స్కోరు చేసింది. తర్వాతి రెండు ఓవర్లలో కుల్దీప్, అక్షర్ ఆరు రన్సే ఇచ్చారు. 9వ ఓవర్‌లో కుల్దీప్ మ్యాజిక్ చేశాడు. ఆరు బాల్స్ తేడాలో రాహుల్ చోప్రా (3), వసీమ్, హర్షిత్ కౌశిక్ (2)ను ఔట్ చేశాడు.
మూడు రన్స్ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో యూఏఈ 50/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో ఎండ్‌లో వరుణ్ చక్రవర్తి రన్స్‌ను కట్టడి చేయడం, 10 ఓవర్లలో స్కోరు 51/5గా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. 11వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన శివమ్ దూబే.. ఆసిఫ్ ఖాన్ (2)ను దెబ్బకొడితే.. తర్వాతి ఓవర్‌లో అక్షర్ పటేల్ టర్నింగ్ బాల్‌కు సిమ్రన్‌జీత్ సింగ్ (1) ఎల్బీ అయ్యాడు. ఇక 13వ ఓవర్‌లో దూబే డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగు బాల్స్ తేడాలో ధ్రువ్ పరాశర్ (1), జునైద్ సిద్ధిఖీ (0)ని ఔట్ చేశాడు. 14వ ఓవర్ ఫస్ట్ బాల్‌కు కుల్దీప్.. హైదర్ అలీ (1)ని పెవిలియన్‌కు పంపడంతో యూఏఈ చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
సంక్షిప్త స్కోర్లు
- యూఏఈ: 13.1 ఓవర్లలో 57 ఆలౌట్ (షరాఫ్ 22, వసీమ్ 19, కుల్దీప్ 4/7, దూబే 3/4).
- ఇండియా: 4.3 ఓవర్లలో 60/1 (అభిషేక్ 30, గిల్ 20*, జునైద్ 1/16).