ఆటతో బదులిస్తారా?.ఇవాళ విండీస్ తో తొలి టీ20

ఆటతో బదులిస్తారా?.ఇవాళ విండీస్ తో తొలి టీ20
  • నేడు విండీస్‌‌తో ఇండియా తొలి టీ20
  • మిడిలార్డర్‌‌పై దృష్టి పెట్టిన కోహ్లీసేన
  •  సొంతగడ్డపై బలంగా విండీస్‌‌
  • మ్యాచ్‌‌ రా.8  నుంచి  సోనీ నెట్‌‌వర్క్‌‌లో

వరల్డ్‌‌కప్‌‌ ముగిసిన అధ్యాయం.!  సెమీస్‌‌లో న్యూజిలాండ్‌‌ చేతిలో ఓటమి.. ఆ తర్వాత పరిణామాలు.. జట్టులో విభేదాలన్న వార్తలు గతం..!  వీటన్నింటినీ  మరచి కోహ్లీసేన మళ్లీ ఆటపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది..!  రోహిత్‌‌తో తనకు పొసగడం లేదన్నవి ఊహాగానాలే అని కొట్టి పారేసిన కెప్టెన్‌‌ కోహ్లీ.. టీమ్‌‌లో ఆల్ ఈజ్‌‌ వెల్‌‌ అని చాటి చెప్పేందుకు.. విమర్శలకు ఆటతోనే సమాధానం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది..!  మూడు ఫార్మాట్లలో వెస్టిండీస్‌‌తో తలపడేందుకు కరీబియన్‌‌ టూర్‌‌కు వచ్చిన టీమిండియా ముందు పొట్టి ఫార్మాట్‌‌లో అమీతుమీ తేల్చుకోనుంది..! అదే సమయంలో  కొత్త కుర్రాళ్లను పరీక్షిస్తూ..  ఎప్పటి నుంచో  వేధిస్తున్న మిడిలార్డర్‌‌ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆశిస్తోంది..!  ఇవి జరగడం అనుకున్నంత ఈజీ కాదు..!   మిగతా ఫార్మాట్లలో ఎలా ఉన్నాసరే గానీ.. టీ20లు అనగానే కరీబియన్లు రెచ్చిపోయి ఆడతారు..!  మరి, కోహ్లీసేన ఏం చేస్తుందో చూడాలి..! 

లాడర్‌‌హిల్స్‌‌: వన్డే ప్రపంచకప్‌‌ ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది.మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా  వెస్టిండీస్‌‌తో శనివారం తొలి టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. ఆటగాళ్ల మధ్య విభేదాలపై ఓవైపు చర్చ జరుగుతుండగా, ఆటతోనే వాటికి సమాధానం చెప్పాలని విరాట్‌‌సేన భావిస్తోంది.  కీలకమైన టీ20 ప్రపంచకప్‌‌కు మేటి జట్టును సిద్ధం చేయడంతోపాటు కెప్టెన్‌‌గా తన స్థాయిని మరోసారి చాటాలని కోహ్లీ భావిస్తున్నాడు.  మరోవైపు వన్డే ప్రపంచకప్‌‌లో నిరాశపర్చిన విండీస్‌‌.. అచ్చొచ్చిన పొట్టి ఫార్మాట్‌‌లో  సత్తాచాటాలని కోరుకుంటోంది. అయితే, మ్యాచ్‌‌కు వర్షం ముప్పు ఉండడం ఇరు జట్లను ఆందోళన కలిగిస్తోంది.

 పాండే, అయ్యర్‌‌లో ఒక్కరే

అదరగొట్టే టాపార్డర్‌‌, భీకరమైన పేసర్లు, చక్కని స్పిన్‌‌ ద్వయమున్నప్పటికీ మిడలార్డర్‌‌ వైఫల్యం వల్లే  ప్రపంచకప్‌‌ సెమీస్​లోనే ఇండియా  ఓడింది. నాలుగో నంబర్‌‌లో ప్రయోగాలకు పోయి కోహ్లీసేన.. ఒట్టి చేతులతో తిరిగొచ్చింది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చే క్రమంలో మిడిలార్డర్‌‌ను పటిష్ట పర్చాలని జట్టు మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే పాత కాపులు మనీశ్‌‌ పాండే, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ను జట్టులోకి తీసుకుంది. ఇండియా తరపున గతేడాది నవంబర్‌‌లో పాండే మ్యాచ్‌‌ ఆడగా.. శ్రేయస్‌‌ గతేడాది ఫిబ్రవరిలో బరిలోకి దిగాడు. ఇటీవలి వెస్టిండీస్‌‌ టూర్‌‌లో ఇండియా–ఎ తరపున అదరగొట్టిన వీరిద్దరూ తమకు లభించిన సువర్ణావకాశాన్ని రెండు చేతులా అందిపుచుకోవాలని భావిస్తున్నారు.  అయితే బలమైన టాప్‌‌ ఆర్డర్‌‌ ఉండడంతో వీరికి లభించే కొన్ని అవకాశాల్లోనే తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుత టీమ్‌‌ లైనప్‌‌ ప్రకారం వీరిద్దిరిలో ఒకరికే తుదిజట్టులో అవకాశముండొచ్చు. అయితే ఈ సిరీస్‌‌లో సత్తాచాటితే మున్ముందు జట్టులో చోటు సుస్థిరం కానుంది.

బరిలోకి ధవన్‌‌..

ఈ సిరీస్‌‌లో ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌ బరిలోకి దిగనున్నాడు. వరల్డ్‌‌కప్‌‌లో అయిన  గాయం నంచి కోలుకుని ఫుల్‌‌జోష్‌‌తో టీమ్‌‌లోకి వచ్చిన తను పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని భావిస్తున్నాడు. మరో ఓపెనర్‌‌ రోహిత్‌‌ శర్మతో  వరల్డ్‌‌కప్‌‌ సూపర్ ఫామ్‌‌ను కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. మూడో స్థానంలో వచ్చే కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ.. వివాదాలు జట్టు ఏకాగ్రతను దెబ్బతీయలేదని తన నాయకత్వ సామర్థ్యంతో చాటాలని భావిస్తున్నాడు. ఇక వరల్డ్‌‌కప్‌‌లో అంతంతమాత్రంగానే రాణించిన కోహ్లీ.. తన పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని భావిస్తున్నాడు. కీలకమైన లోకేశ్‌‌ రాహుల్‌‌ నాలుగో నంబర్‌‌లో బరిలోకి దిగనున్నాడు. గత టూర్‌‌లో ఇదే మైదానంలో తను చేసిన అజేయ సెంచరీ అతని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు మాజీ కెప్టెన్‌‌ ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌.. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరముంది. అన్ని ఫార్మాట్లకు భవిష్యత్‌‌ వికెట్‌‌కీపర్‌‌గా తను పరిగణిస్తుండడంతో సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబట్టాలి. వీలైనన్ని అవకాశాలు కల్పిస్తామని సెలెక్టర్లు భరోసా ఇవ్వడంతో తను బ్యాట్‌‌ ఝుళిపించడంపై దృష్టిపెట్టాలి. ఆల్‌‌రౌండర్‌‌ కోటాలో రవీంద్ర జడేజాకు తోడుగా హిట్టర్‌‌  క్రునాల్‌‌ పాండ్యాను పరీక్షించవచ్చు.  బౌలింగ్‌‌లో స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఫస్ట్‌‌చాయిస్‌‌ పేసర్‌‌గా భువనేశ్వర్‌‌ ఆడుతుండగా..ఖలీల్‌‌ అహ్మద్‌‌, నవదీప్‌‌ సైనీ, దీపక్‌‌ చహర్‌‌ ఇద్దరికి తుదిజట్టులో చోటు దక్కుతుంది. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనుకుంటే ఐపీఎల్‌‌లో అదరగొట్టిన యువ స్పిన్నర్‌‌  రాహుల్‌‌ చహర్‌‌ అరంగేట్రం చాన్స్‌‌ కూడా ఉంది.

ఆండ్రీ రసెల్​ ఔట్​

షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ఇండియాపై వెస్టిండీస్‌‌కు అద్భుత రికార్డు ఉంది. ఇండియాతో ఐదు మ్యాచ్‌‌లు ఆడి కరీబియన్‌‌ జట్టు మూడింటిలో విజయం సాధించింది. అనుభవం, యువ క్రికెటర్ల కలబోతతో ఉన్న విండీస్‌‌కు టీ20ల్లో ప్రమాదకరమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌‌ అయిన విండీస్‌‌కు ఒంటిచేత్తో మ్యాచ్‌‌ను మలుపు తిప్ప ఆటగాళ్లు సొంతం. ‘యూనివర్స్‌‌ బాస్‌‌’ క్రిస్‌‌ గేల్‌‌ అందుబాటులో లేకున్నా  కీరన్‌‌ పొలార్డ్‌‌, ఎవిన్‌‌ లూయిస్‌‌, నికోలస్‌‌ పూరన్‌‌, కెప్టెన్‌‌ కార్లోస్‌‌ బ్రాత్‌‌వైట్‌‌ లాంటి విధ్వంసక ఆటగాళ్లతో పటిష్టంగా ఉంది. స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ఆండ్రీ రసెల్‌‌ చివరి నిమిషంలో తొలి రెండు టీ20లకు దూరం కావడం ఆ జట్టుకు కాస్త ప్రతికూలాంశం అనొచ్చు.  బౌలింగ్‌‌లో ఒషానే థామస్‌‌, సునీల్‌‌ నరైన్‌‌, షెల్డన్‌‌ కొట్రేల్‌‌, కీమో పాల్‌‌ లతో బలంగా ఉంది. ఇప్పటివరకు సొంతగడ్డపై ఇండియాకు టీ20 సిరీస్‌‌ కోల్పోని విండీస్‌‌ అదే తరహా ఆటతీరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

జట్లు (అంచనా):

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌), రోహిత్‌‌, ధవన్‌‌, రాహుల్‌‌, పాండే/అయ్యర్‌‌, పంత్‌‌, జడేజా/క్రునాల్‌‌, భువనేశ్వర్‌‌, ఖలీల్‌‌, దీపక్‌‌/నవదీప్‌‌, రాహుల్‌‌ చహర్‌‌

వెస్టిండీస్: బ్రాత్‌‌వైట్‌‌ (కెప్టెన్‌‌), లూయిస్‌‌, హెట్‌‌మయర్‌‌, పొలార్డ్‌‌, పూరన్‌‌, రోమన్‌‌ పావెల్, జాన్‌‌ క్యాంప్‌‌బెల్‌‌, నరైన్‌‌, కొట్రెల్‌‌, కీమో పాల్‌‌/థామస్‌‌, పైర్‌‌