T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు (ఫిబ్రవరి 22న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రిక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురించి దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్–8లో భారత్‌పై అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.. సౌతాఫ్రికాపై గెలవడమే కాదు, సెమీఫైనల్స్, ఫైనల్స్‌కు చేరాలనే ఒత్తిడి క్లియర్ గా వారిపై కనిపిస్తుందన్నారు. ఆ ఒత్తిడినే తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
గతేడాది దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించిన విషయాన్ని షుక్రి కాన్రాడ్ గుర్తు చేసుకున్నారు. ఐదు టీ20ల సిరీస్‌ను 3–1తో కోల్పోయినా, ఆ పర్యటన తమకు మంచి అనుభవాన్ని ఇచ్చిందన్నారు. ఆ టూర్ తర్వాత ఇక్కడి పరిస్థితులు, అభిమానుల హోరును దగ్గరగా చూశాం.. రేపటి మ్యాచ్‌లో స్టేడియం నిండా లక్షలాది మంది అభిమానులు బ్లూ జెర్సీల్లో కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి వాతావరణానికి మేం సిద్ధంగా ఉన్నాం.. ఇది గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఒకటే.. దీనికి మేం పూర్తి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ప్రపంచకప్ వంటి టోర్నీల్లో ఒత్తిడి అనేది ప్రతి జట్టుపై ఉంటుందని ప్రోటీస్ హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ అభిప్రాయపడ్డారు. ఆ ఒత్తిడి తమపై కూడా ఉంటుంది, అయితే భారత్‌పై ఉండే ఒత్తిడిని చాలా మంది పట్టించుకోరని అన్నారు. టాప్ జట్టుతో ఆడుతున్నామన్న ఒత్తిడిపై మనం మాట్లాడతాం.. కానీ వాళ్లపై ఉండే ఒత్తిడి ఎంత ఉంటుందో చాలా మందికి అర్థం కాదు అని ఆయన చెప్పారు.
