టెస్టులు పెంచితే ఇండియాలో మరిన్ని కేసులు నమోదైతయ్: ట్రంప్

టెస్టులు పెంచితే ఇండియాలో మరిన్ని కేసులు నమోదైతయ్: ట్రంప్

వాషింగ్టన్: కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తే ఇండియా, చైనా వంటి దేశాలలో అమెరికాలో కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఇప్పటివరకు 20 మిలియన్ల పరీక్షలు నిర్వహించిందని, జర్మనీ నాలుగు మిలియన్లు, దక్షిణ కొరియా మూడు మిలియన్ల టెస్టులు మాత్రమే నిర్వహించిందన్నారు. శనివారం మెయిన్ సిటీలోని ప్యూరిటన్ మెడికల్ ప్రొడక్ట్స్ కంపెనీ విజిట్ సందర్భంగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ‘‘మేము 20 మిలియన్లకు పైగా టెస్టులు నిర్వహించాం. ఇండియా, చైనా వంటి దేశాలలో మరిన్ని టెస్టులు చేస్తే.. కరోనా కేసులు మరిన్ని బయటపడుతాయి”అని ట్రంప్ అన్నారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారీలో ‘ప్యూరిటన్ మెడికల్ ప్రాడక్ట్స్’ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వాటిలో ఒకటి అని అన్నారు. ‘‘అమెరికా దేశం తిరిగి తెరవబడుతోంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. ఎవరూ అనుకోని విధంగా వచ్చే ఏడాదిలో మన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది”అని ఆయన అన్నారు.