బంగ్లాను నిర్దాక్షిణ్యంగా వేటాడిన భారత బౌలర్లు

బంగ్లాను నిర్దాక్షిణ్యంగా వేటాడిన భారత బౌలర్లు

ఒకప్పటి మన బలహీనత (పేస్‌‌).. ఇప్పుడు బలంగా మారింది..! ఒకప్పటి మన బలం (స్పిన్‌‌).. ఇప్పుడు ఆసరాగా నిలుస్తోంది..!
ఈ రెండింటి ఫలితమే.. సొంతగడ్డపై టీమిండియాకు మరో ఇన్నింగ్స్‌‌ విజయం..! అంచనాలు తప్పకుండా.. అవకాశాలను వృథా చేయకుండా.. తొలి టెస్ట్‌‌లో సూపర్‌‌ షో చూపెట్టిన పేసర్లు.. బంగ్లాదేశ్‌‌ను నిర్దాక్షిణ్యంగా వేటాడేశారు..! షమీ (4/31) స్వింగ్‌‌ సుడికి.. ఉమేశ్‌‌ (2/51) పేస్‌‌ దాడికి.. ఇషాంత్‌‌ (1/31) బౌన్స్‌‌ దెబ్బకు తోడుగా.. అశ్విన్‌‌ (3/42) స్పిన్‌‌ ఉచ్చుకు విలవిలలాడిన పులులు.. మూడు రోజుల్లోనే మ్యాచ్‌‌ను అప్పనంగా అప్పగించేశారు..! దీంతో ఇన్నింగ్స్‌‌ విజయాల హ్యాట్రిక్‌‌ పూర్తి చేసిన కోహ్లీసేన.. రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 1-0 లీడ్​లో నిలిచింది..!!

పేస్‌ షో

ఇండోర్‌‌: అందరూ ఊహించినట్లుగానే.. తొలి టెస్ట్‌‌లో ఇండియా అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో సూపర్ పెర్ఫామెన్స్‌‌ చూపెడుతూ.. మూడు రోజుల్లోనే (శనివారం) ముగిసిన మ్యాచ్‌‌లో ఇన్నింగ్స్‌‌ 130 రన్స్‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసింది. ఫలితంగా రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో టీమిండియా 1–0 లీడ్​లో నిలిచింది. తాజా విక్టరీ.. ఇండియాకు సొంతగడ్డపై మూడో ఇన్నింగ్స్‌‌ విజయం కావడం విశేషం. గత సిరీస్‌‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో, మూడో టెస్ట్‌‌లోనూ విరాట్‌‌సేన ఇన్నింగ్స్‌‌ విజయాలను సాధించింది. ఇక ఈ గెలుపుతో 60 పాయింట్లు సాధించిన ఇండియా.. వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో 300 పాయింట్లతో టాప్‌‌ పొజిషన్‌‌ను మరింత పదిలం చేసుకున్నది. ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 493/6 వద్దే ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్‌‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన బంగ్లాదేశ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ (64), మెహిదీ హసన్‌‌ (38), లిటన్‌‌ దాస్‌‌ (35) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మయాంక్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య 22 నుంచి
కోల్‌‌కతాలో డేనైట్‌‌ టెస్ట్‌‌ జరుగుతుంది.

షమీ జోరు..

అనుకూలమైన పరిస్థితుల మధ్య టీమిండియా పేసర్లు ఇషాంత్‌‌, ఉమేశ్‌‌ మంచి లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో చెలరేగారు. పేస్‌‌తో పాటు ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌ రాబడుతూ బంగ్లా ఓపెనర్లను కుదురుకోనీయలేదు. 6వ ఓవర్‌‌లో ఉమేశ్‌‌ వేసిన ఔట్‌‌ స్వింగర్‌‌.. కైస్‌‌ (6) లెగ్‌‌ వికెట్‌‌ను పడగొట్టగా, తర్వాతి ఓవర్‌‌లో ఇషాంత్‌‌ ఫుల్‌‌లెంగ్త్‌‌ డెలివరికి షాద్మన్‌‌ (6) ఔటయ్యాడు. దీంతో 12 బంతుల తేడాలో ఓపెనర్లిద్దరూ పెవిలియన్‌‌కు చేరడంతో బంగ్లా 16/2 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఛేంజ్‌‌ బౌలర్‌‌గా వచ్చిన షమీ అద్భుతమైన స్వింగ్‌‌తో మొమినుల్‌‌ (7), మిథున్‌‌ (18)ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆరంభంలో డీఆర్‌‌ఎస్‌‌ నుంచి బయటపడ్డ మొమినుల్‌‌.. 13వ ఓవర్‌‌లో షమీ వేసిన యాంగిల్‌‌ బాల్‌‌కు అడ్డంగా వికెట్ల ముందు దొరికాడు. ఫీల్డ్‌‌ అంపైర్‌‌ నాటౌట్‌‌ ఇచ్చినా.. కోహ్లీ రివ్యూకు వెళ్లి సక్సెస్‌‌ అయ్యాడు. షమీ.. తన తర్వాతి ఓవర్‌‌ (15వ)లో వేసిన షార్ట్‌‌ పిచ్‌‌కు మిథున్‌‌.. మిడ్‌‌వికెట్‌‌లో మయాంక్‌‌ చేతికి చిక్కాడు. దీంతో బంగ్లా 44/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. 17వ (షమీ) ఓవర్‌‌లో ముష్ఫికర్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను స్లిప్‌‌లో రోహిత్‌‌ డ్రాప్‌‌ చేయడంతో మూడో వికెట్‌‌ దక్కే చాన్స్‌‌ మిస్సయింది. ముష్ఫికర్‌‌, మహ్మదుల్లా (15) నిలకడ చూపడంతో 60/4 స్కోరుతో బంగ్లా లంచ్‌‌కు వెళ్లింది.

ముష్ఫికర్‌‌ హాఫ్‌‌ సెంచరీ

లంచ్‌‌ తర్వాత జడేజాను బౌలింగ్‌‌కు తీసుకొచ్చిన కోహ్లీ.. రెండో ఎండ్‌‌లో షమీని కొనసాగించడం మంచి ఫలితాన్నిచ్చింది. 27వ ఓవర్‌‌లో షమీ వేసిన ఔట్‌‌సైడ్‌‌ ఆఫ్‌‌ బాల్‌‌కు మహ్మదుల్లా… స్లిప్‌‌లో రోహిత్‌‌కు రెగ్యులర్‌‌ క్యాచ్‌‌ ఇచ్చాడు. దీంతో ఐదో వికెట్‌‌కు 28  పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ముష్ఫికర్‌‌తో జతకలిసిన లిటన్‌‌ దాస్‌‌.. పేస్‌‌–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. జడేజా–షమీ, ఇషాంత్‌‌–అశ్విన్‌‌ బౌలింగ్‌‌లో సులువుగా రన్స్‌‌ రాబట్టాడు. ఇషాంత్‌‌ వేసిన 31వ ఓవర్‌‌లో మూడు ఫోర్లు కొట్టిన లిటన్‌‌.. బంగ్లా స్కోరును 100కు చేర్చాడు. ముష్ఫికర్‌‌, లిటన్‌‌.. దాదాపు 12వ ఓవర్ల పాటు వికెట్‌‌ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే రెండు ఎండ్‌‌ల నుంచి స్పిన్నర్ల రాకతో లిటన్‌‌ ఇబ్బందిపడ్డాడు. చివరకు 40వ ఓవర్‌‌లో అశ్విన్‌‌కు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆరో వికెట్‌‌కు 63 రన్స్‌‌ సమకూరాయి. ఫస్ట్‌‌బాల్‌‌కే రివ్యూ నుంచి బయటపడ్డ మెహిదీ హసన్‌‌ భారీ సిక్సర్‌‌తో టచ్‌‌లోకి వచ్చాడు. అవతలివైపు నిలకడగా ఆడిన ముష్ఫికర్‌‌ 101 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌‌ను అందుకున్నాడు. మరో వికెట్‌‌ పడకుండా ఆడిన ఈ జంట 191/6తో రెండో సెషన్‌‌ను ముగించింది.

అశ్విన్‌‌ డబుల్‌‌..

టీ తర్వాత తొలి ఓవర్‌‌ ఐదో బాల్‌‌కే మిథున్‌‌ను ఉమేశ్‌‌ పెవిలియన్‌‌కు పంపాడు. లోయర్‌‌ ఆర్డర్‌‌లో ఉపయుక్తమైన బ్యాట్స్‌‌మెన్‌‌ లేకపోవడంతో ముష్ఫికర్‌‌ ఎక్కువగా స్ట్రయికింగ్‌‌ తీసుకున్నాడు. తైజుల్‌‌ ఇస్లామ్‌‌ (6) డిఫెన్స్‌‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడంతో ఇండియా విజయం ఆలస్యమైంది. బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా తొలి గంట ఈ జోడీ వికెట్‌‌ ఇవ్వలేదు. ఆఖరి స్పెల్‌‌కు వచ్చిన షమీ..  67వ ఓవర్‌‌లో తైజుల్‌‌ వికెట్‌‌ను తీసి మళ్లీ స్ట్రయిక్‌‌ ఇచ్చాడు. 8 బంతుల తర్వాత అశ్విన్‌‌ దెబ్బకు ముష్ఫికర్‌‌ ఔట్‌‌కావడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. అజు జాయేద్‌‌ (4 నాటౌట్‌‌) ఓ ఫోర్‌‌ కొట్టినా, తన తర్వాతి ఓవర్‌‌లోనే అశ్విన్‌‌… ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (1)ను ఔట్‌‌ చేసి ఇండియాకు విజయాన్ని ఖాయం చేశాడు.