మదురై: ఎఫ్‌ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్‌లో ఆతిథ్య ఇండియా వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్–బి చివరి మ్యాచ్‌లో ఇండియా కుర్రాళ్ల టీమ్ 5–0తో బలమైన స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. గ్రూప్‌లో అజేయంగా, అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.
వరుసగా మూడో పోరులోనూ ఇండియా ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. చిలీ, ఒమన్‌ను చిత్తుగా ఓడించిన జోరును ఆతిథ్య కుర్రాళ్లు స్విస్‌పైనా చూపెట్టారు. రెండో నిమిషంలోనే గోల్ కొట్టిన మన్మీత్ సింగ్ 11వ నిమిషంలో మరో గోల్ అందించాడు. శర్దానంద్ తివారి (13వ, 54వ నిమిషాల్లో) కూడా రెండు గోల్స్ కొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ (28వ ని) ఓ గోల్ సాధించాడు. ఇండియా డిఫెన్స్ బలంగా ఉండటంతో స్విస్ టీమ్ ఖాతా తెరవలేకపోయింది.
