అమ్మాయిలకు బ్రాంజ్‌‌ ఖాయం

అమ్మాయిలకు బ్రాంజ్‌‌ ఖాయం

షా ఆలమ్‌‌ (మలేసియా): బ్యాడ్మింటన్‌‌ ఆసియా టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. విమెన్స్‌‌ టీమ్‌‌ బ్రాంజ్‌‌ మెడల్‌‌ ఖాయం చేసుకోగా, మెన్స్‌‌ టీమ్‌‌ నిరాశపర్చింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో విమెన్స్‌‌ టీమ్‌‌ 3–0తో హాంకాంగ్‌‌ను ఓడించి సెమీస్‌‌లోకి దూసుకెళ్లింది. తొలి సింగిల్స్‌‌లో పీవీ సింధు 21–7, 16–21, 21–12తో లో సిన్‌‌ యెన్‌‌ హ్యాపీపై గెలవగా, డబుల్స్‌‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–10, 21–14తో యుంగ్‌‌ ఎంగా టింగ్‌‌–యుంగ్‌‌ పుయ్‌‌ లామ్‌‌ను ఓడించారు.

రెండో సింగిల్స్‌‌లో అష్మిత చాలిహా 21–12, 21–13తో యుంగ్‌‌ సుమ్‌‌ యీపై నెగ్గి 3–0తో విజయాన్ని అందించింది. సెమీస్‌‌లో ఇండియా.. టాప్‌‌ సీడ్‌‌ జపాన్‌‌తో తలపడుతుంది. ఇక మెన్స్‌‌ క్వార్టర్స్‌‌లో ఇండియా 2–3తో జపాన్‌‌ చేతిలో ఓడింది. సింగిల్స్‌‌లో ప్రణయ్‌‌ ఓడగా, లక్ష్యసేన్‌‌ గెలిచాడు. డబుల్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ గెలవగా, అర్జున్‌‌–ధ్రువ్‌‌ కపిల జోడీ నిరాశపర్చింది.

దీంతో ఇరుజట్ల స్కోరు 2–2తో సమమైంది. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌ 21–17, 9–21, 20–22తో కెంటో మెమోటా చేతిలో ఓడాడు. మూడో గేమ్‌‌లో 19–17 ఆధిక్యంలో ఉన్న శ్రీ మ్యాచ్‌‌ను కాపాడుకోలేకపోయాడు. రెండు పాయింట్లు కోల్పోవడంతో ఓ దశలో ఇద్దరు ప్లేయర్లు 20–20తో సమంగా నిలిచారు. కానీ చివర్లో కెంటో రెండు సూపర్‌‌ డ్రాప్‌‌లతో గేమ్‌‌ను సొంతం చేసుకున్నాడు.