
- పాకిస్తాన్‌పై ఇండియా గ్రాండ్ విక్టరీ
- 88 రన్స్ తేడాతో పాక్ చిత్తు
- రాణించిన హర్లీన్, రిచా
- సత్తా చాటిన దీప్తి, క్రాంతి
- విమెన్స్ వన్డే వరల్డ్ కప్
కొలంబో: టోర్నీ ఏదైనా.. ఆడేది ఎవరైనా... పోటీ ఎక్కడైనా.. పాకిస్తాన్‌తో క్రికెట్ ఫైట్‌లో టీమిండియాకు తిరుగులేదు. ఆసియా కప్‌లో దాయాదిని టీమిండియా మూడుసార్లు మట్టి కరిపిస్తే.. ఇప్పుడు విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో అమ్మాయిలు కూడా పాక్ పని పట్టారు. బ్యాటింగ్‌లో హర్లీన్ డియోల్ (65 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46), రిచా ఘోశ్ (20 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్).. బౌలింగ్‌లో పేసర్ క్రాంతి గౌడ్ (3/20) సత్తా చాటడంతో ఆదివారం (అక్టోబర్ 06) జరిగిన లీగ్ మ్యాచ్‌లో 88 రన్స్ తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించారు.
ఈ వన్‌సైడ్ పోరులో తొలుత ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 247 రన్స్‌కు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (32), ప్రతీకా రావల్ (31) కూడా రాణించారు. పాక్ బ్యాటర్లలో డయానా బేగ్ (4/69) నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం ఛేజింగ్‌లో పాక్ 43 ఓవర్లలో 159 రన్స్‌కే ఆలౌటైంది. సిద్రా అమిన్ (81) ఒంటరి పోరాటం వృథా అయింది. దీప్తి కూడా మూడు వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. క్రాంతికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన ఇండియా గురువారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఆదుకున్న హర్లీన్, రిచా
బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌పైఇండియా జాగ్రత్తగా ఆడింది. యంగ్ ఓపెనర్ ప్రతీక ఉన్నంతసేపు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకుంది. డయానా బేగ్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించింది. మరో ఎండ్‌లో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (23) క్రీజులో కుదురుకున్న తర్వాత పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్‌లో ఎల్బీ అవ్వడంతో తొలి వికెట్‌కు 48 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. కొద్దిసేపటికే ప్రతికా రావల్ కూడా ఔటవ్వడంతో ఇండియా ఆరంభంలోనే కష్టాల్లో పడింది.
ఈ దశలో వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ బాధ్యత తీసుకుంది. సంయమనంతో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (19)తో కలిసి మూడో వికెట్‌కు 39 రన్స్ జోడించి స్కోరు వంద దాటించింది. అయితే, హర్మన్ దురదృష్టవశాత్తూ డయానా బౌలింగ్‌లో ఇన్‌సైడ్ ఎడ్జ్‌తో వెనుదిరిగింది. ఆ వెంటనే జెమీమా కూడా ఔటవ్వాల్సింది. మూడు రన్స్ వద్ద డయానా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చినా.. అది నో బాల్ కావడంతో బతికి పోయింది. జెమీమాతో కలిసి పోరాటం కొనసాగించిన హర్లీన్ నాలుగో వికెట్‌కు 45 రన్స్ జోడించింది. ఈ క్రమంలో ఫిఫ్టీకి చేరువైన ఆమె భారీ షాట్‌కు ప్రయత్నించి రమీన్ బౌలింగ్‌లో ఔటైంది.
కాసేపటికే జెమీమా కూడా వెనుదిరడంతో 159/5తో ఇండియా డీలా పడింది. అయితే, సీనియర్లు దీప్తి శర్మ (25), స్నేహ్ రాణా (20) ఆరో వికెట్‌కు కీలకమైన 42 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటైనా చివర్లో హిట్టర్ రిచా ఘోష్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడింది. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్సర్లతో విజృంభించింది. ఆమె కొట్టిన ఓ అద్భుతమైన స్వీప్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రిచా మెరుపులతో ఇండియా స్కోరు 240 మార్కు దాటింది.
సిద్రా పోరాడినా..
ఇండియా బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేయడంతో ఛేజింగ్‌లో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్లోనే ఓపెనర్ ముబీనా అలీ (2) అనూహ్యంగా రనౌటైంది. తొలుత ఆమె ఎల్బీ కోసం క్రాంతి గౌడ్ అప్పీల్ చేయగా అంపైర్ ఇవ్వలేదు. ఈలోపు దీప్తి శర్మ మెరుపు త్రో చేసి వికెట్లను పడగొట్టింది. ముబీనా క్రీజు పక్కనే ఉన్నా.. ఆమె బ్యాట్ గాల్లో ఉండటంతో రనౌటైంది. కొద్దిసేపటికే సదాఫ్ (6)ను రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చిన క్రాంతి 12వ ఓవర్లో ఆలియా (2)ను కూడా ఔట్ చేయడంతో పాక్ 26/3తో కష్టాల్లో పడింది.
ఈ దశలో మరో ఓపెనర్ సిద్రా అమిన్ క్రీజులో పాతుకుపోయింది. అతి జాగ్రత్తగా ఆడిన ఆమె.. నటాలియా (33)తో 20 ఓవర్లకు పాక్‌ను 57/3తో నిలిపింది. ఆ తర్వాత సిద్రా, నటాలియా వరుస బౌండ్రీలతో ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన క్రాంతి.. నటాలియాను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 69 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేసింది.
కెప్టెన్ ఫాతిమ (2)ను దీప్తి ఔట్ చేసినా.. అమిన్ తన పోరాటం కొనసాగించింది. సిద్రా నవాజ్ (14) తోడుగా 37 ఓవర్లకు పాక్‌ను 141/5తో నిలిపి ఆశలు రేపింది. కానీ, నాలుగు బాల్స్ తేడాలో నవాజ్‌ను స్నేహ్, రమీన్ (0)ను దీప్తి పెవిలియన్ చేర్చి ఆ జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించారు. కాసేపటికే సిద్రా అమిన్‌ను కూడా స్నేహ్ పెవిలియన్ చేర్చడంతో పాక్ ఓటమి ఖాయమైంది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 247 ఆలౌట్ (హర్లీన్ 46, రిచా 35 నాటౌట్, డయానా బేగ్ 4/69).
పాకిస్తాన్: 43 ఓవర్లలో 159 ఆలౌట్ (సిద్రా అమిన్ 81, క్రాంతి 3/20, దీప్తి 3/45).
రిఫరీ మిస్టేక్‌తో టాస్ కోల్పోయిన ఇండియా
ఇండియా కెప్టెన్ హర్మన్ టాస్ నెగ్గినా.. రిఫరీ పొరపాటున పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా టాస్ గెలిచినట్లు ప్రకటించింది. హర్మన్ కాయిన్ ఎగరేయగా సనా టెయిల్స్ అని చెప్పింది. కానీ, రిఫరీ ఫ్రిట్జ్ ఆమె హెడ్స్ చెప్పిందనుకుంది. హెడ్స్ పడడంతో పాక్ టాస్ గెలిచిందని ప్రకటించగా.. సనా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ టైమ్‌లో, ఆట ముగిసిన తర్వాత పాక్ ప్లేయర్లకు ఇండియా షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు.
ఆటను ఆపిన పురుగులు
ఇండియా ఇన్నింగ్స్ టైమ్‌లో పురుగుల కారణంగా 15 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. ఫ్లడ్‌లైట్ల కాంతికి ఆకర్షితమైన పురుగులు గ్రౌండ్‌లోకి రావడంతో పాక్ బౌలర్లు, ఇండియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. 34 ఓవర్ల తర్వాత ప్లేయర్లు గ్రౌండ్ సిబ్బంది పొగ పెట్టే యంత్రం ఉపయోగించారు. ఈ బ్రేక్ తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనా పురుగులు మళ్లీ వచ్చి ఇబ్బంది పెట్టాయి.
12-0 విమెన్స్ వన్డేల్లో పాకిస్తాన్‌తో ఆడిన
12 మ్యాచ్‌ల్లోనూ ఇండియా గెలిచింది