
బెంగళూరు: స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియా విమెన్స్ జట్టు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ మేరకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 10 రోజుల హై ఇంటెన్సిటీ ట్రైనింగ్‌ను పూర్తి చేసింది. మ్యాచ్ సిమ్యులేషన్స్, కండిషనింగ్‌తో పాటు తమ బలాలపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు టీమిండియా ఖాతాలో వరల్డ్ కప్ లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే మెగా టోర్నీలో ఎలాగైనా కప్ కొట్టాలనే బలమైన లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఆడుతుండటం కూడా ఇండియాకు కలిసొచ్చే అంశం.
‘ఫిట్‌నెస్ స్థాయిలను పెంచుకోవడం, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం, రాబోయే సవాళ్లకు జట్టును సిద్ధం చేయడమే ఈ శిబిరం లక్ష్యం’ అని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెప్టెంబర్ 14 నుంచి ఆసీస్‌తో మూడు వన్డేలు ఆడనున్న ఇండియా.. 30న శ్రీలంకతో వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడనుంది. ‘ఇండియన్స్ ఎదురుచూస్తున్న ఆ అడ్డంకిని మేం ఛేదించాలనుకుంటున్నాం. వరల్డ్ కప్ ఎప్పుడూ మాకు ప్రత్యేకమైందే. దేశం తరఫున ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాం. నేను యువీ భయ్యాను చూసినప్పుడల్లా నాకు ప్రేరణనిస్తుంది’ అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది.