
ఆస్ట్రేలియాతో పోటీ పడనున్న మిథాలీ అండ్ కో
ప్రకటించిన బీసీసీఐ సెక్రటరీ జై షా
ఆసీస్ టూర్ షెడ్యూల్ ఖరారు
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ టీమ్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలవనుంది. అమ్మాయిలు తొలిసారి ఓ డే నైట్ టెస్టులో పోటీ పడనున్నారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనున్న ఇండియా ఆ టీమ్‌తో పింక్ బాల్ టెస్టు మ్యాచ్ ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ జై షా గురువారం ప్రకటించారు. విమెన్స్ గేమ్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేసినట్టు ట్వీట్ చేశారు. ‘విమెన్స్ క్రికెట్‌పై మా కమిట్‌మెంట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో ఇండియా విమెన్స్ టీమ్ ఫస్ట్ పింక్ బాల్ డే నైట్ టెస్టు ఆడుతుందని చెప్పేందుకు చాలా సంతోషంగా ఉన్నా’ అని షా పేర్కొన్నారు. కాగా, ఇండియా–ఆసీస్ విమెన్స్ మధ్య డే నైట్ టెస్టు పెర్త్‌లో జరగనుంది.
సెప్టెంబర్‌లో విమెన్స్ టీమ్.. ఆసీస్ టూర్‌కు వెళ్తుందని బీసీసీఐ ఇది వరకే ప్రకటించింది. ఈ టూర్‌లో భాగంగా ఇండియా.. మూడు వన్డేలు, మూడు టీ20ల్లో కూడా కంగారూలతో పోటీ పడనుంది. ఈ టూర్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఖరారు చేసింది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నార్త్ సిడ్నీ (సెప్టెంబర్ 19), సెకండ్, థర్డ్ వన్డేలు జంక్షన్ ఓవల్ (సెప్టెంబర్ 22, 24న) నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అనంతరం ఏకైక టెస్టును సెప్టెంబర్ 30–అక్టోబర్ 3 మధ్య పెర్త్‌లో షెడ్యూల్ చేశారు. ఆపై, నార్త్ సిడ్నీ ఓవల్‌లో (అక్టోబర్7, 9, 11) జరిగే మూడు టీ20లతో టూర్ ముగుస్తుంది. కాగా, విమెన్స్ క్రికెట్‌లో ఇది రెండో డే నైట్ టెస్టు కానుంది. ఇది వరకు ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య 2017లో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. ఇక, ఇండియా విమెన్స్ టీమ్ 15 ఏళ్ల లాంగ్ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడనుంది. చివరగా 2006లో అడిలైడ్‌లో ఆ టీమ్‌తో పోటీ పడింది.