హిందూత్వను  వదులుకోలే.. బీజేపీతో దోస్తీ వద్దనుకున్నం

హిందూత్వను  వదులుకోలే.. బీజేపీతో దోస్తీ వద్దనుకున్నం

ముంబై: బీజేపీ, శివసేన పొత్తుపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య వివాదానికి దారితీశాయి. బీజేపీతో తమ పార్టీ 25 ఏళ్ల పాటు కొనసాగించిన స్నేహంతో ఎటువంటి ప్రయోజం లేదని, అది వృథాగా మారిందని ఇటీవల ఠాక్రే కామెంట్స్ చేశారు. తాజాగా ఈ పొత్తుపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీ ఎదుగుదల కోసం తీవ్రంగా కృషి చేశామన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత దేశంలో ముఖ్యంగా ఉత్తర భారత్ లో శివసేనకు మంచి ఆదరణ కనిపించిందన్నారు. కానీ దాన్ని తాము సరిగ్గా వినియోగించుకోలేదని.. ఒకవేళ ఆ సమయంలో ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తాము పోటీ చేసి ఉంటే శివసేన నాయకుడే ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు. ఆ అవకాశాన్ని చేజార్చుకున్నామని చెప్పారు. 

కాగా, రీసెంట్ గా బీజేపీతో పొత్తు గురించి ఉద్ధవ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ హిందూత్వను అధికారంలోకి రావడానికి వాడుతోందని విమర్శించారు. హిందూత్వ సిద్ధాంతం మీద బీజేపీకి ఓనర్ షిప్ లేదని.. పవర్ కోసం వాళ్లు నకిలీ హిందూత్వ ముసుగును వేసుకున్నారని పేర్కొన్నారు. తాము హిందూత్వను వదులుకోలేదని, బీజేపీతో బంధాన్ని తెంచుకున్నామని స్పష్టం చేశారు. బీజేపీ అంటే హిందూత్వ కాదని వివరించారు.