
న్యూఢిల్లీ : నిధుల మళ్లింపు జరిగిందంటూ తమపై దాఖలైన కేసును వెంటనే లిస్టింగ్ చేయాల్సిందిగా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్) సుప్రీం కోర్టును కోరింది. ఇండియాబుల్స్ ప్రమోటర్లు షెల్ కంపెనీల ద్వారా రూ. 98 వేల కోట్ల పబ్లిక్ మనీని దారి మళ్లించారని ఆరోపిస్తూ ఇన్వెస్టర్ ఒకరు సోమవారం సుప్రీం కోర్టులో కేసును వేశారు. ఈ కేసు విచారణను అర్జెంట్‌గా చేపట్టాలని వెకేషన్ బెంచ్‌ను కోరారు. వెకేషన్ బెంచ్‌లో జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగిలు సభ్యులు. కంపెనీని బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఈ కేసును దాఖలు చేశారని, అవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఐహెచ్‌ఎఫ్‌ఎల్ తరఫున వకాల్తా తీసుకున్న సీనియర్ అడ్వకేట్ ఏ ఎం సింఘ్వి చెప్పారు. ఈ కేసు ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు రోజుల్లోనే రూ. 7,000 కోట్లు తగ్గిపోయిందన్నారు.
బ్లాక్‌మెయిల్ చేయడమే కేసు ఉద్దేశమని, కంపెనీ పరువు బజారుకు ఈడ్చాలనేదే లక్ష్యమని తెలుస్తోందని బెంచ్‌కు తన వాదన వినిపించారు. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్‌ను మీడియాకు లీక్ చేయడంతో ఈ విషయం అర్ధమవుతోందని పేర్కొన్నారు. దీంతో అర్జెంట్ లిస్టింగ్ కోరాల్సి వస్తోందని బెంచ్‌ను అభ్యర్ధించారు. తీవ్రమైన నష్టాలపాలవుతున్నందున కేసు విచారణ వెంటనే చేపట్టాల్సిందిగా కోరారు. సుప్రీం కోర్టులో ఉదయమే మెన్షన్‌కు రాగా సాయంత్రంలోగా కేసు లిస్టింగ్ విషయం నిర్ణయిస్తామని బెంచ్ తెలిపింది. ఈ అంశంలో ఏ విధమైన ప్రొసీజర్ పాటించాలో తెలుసుకుని చెబుతామని పేర్కొంది.
పిటిషన్ దాఖలుకు అనుమతించడంలో సమస్యేమీ లేదని, కాకపోతే వెకేషన్ బెంచ్ ముందు కేసు లిస్టింగ్ చేయాలంటే అర్జంటై ఉండాలని తెలిపింది. ఆ తర్వాత కేసును వెకేషన్ తర్వాత జులై నెలలో విచారించనున్నట్లు బెంచ్ ప్రకటించింది. మూడు వేల రూపాయలతో నాలుగు షేర్లు కొన్న పిటిషనర్, కేవలం బ్లాక్‌మెయిలింగ్ కోసమే ఈ కేసును దాఖలు చేసినట్లు ఇండియాబుల్స్ హౌసింగ్ మీడియా ప్రకటన విడుదల చేసింది. ఇండియాబుల్స్ ఛైర్మన్ సమీర్ గెహ్లాట్ స్పెయిన్‌లోని ఎన్‌ఆర్‌ఐ హరీష్ ఫాబియాని సాయంతో వేల కోట్లను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దారి మళ్లించినట్లు ఆ పిటిషినర్ ఆరోపించారు.
ఇండియాబుల్స్ అప్పుల రూపంలో ముందు షెల్ కంపెనీలకు, అదే అప్పుల మొత్తాన్ని అక్కడి నుంచి ఛైర్మన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు మళ్లించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇండియాబుల్స్ నిధుల మళ్లింపును సెబీ, ఆర్‌బీఐ, ఇన్‌కంటాక్స్ డిపార్టమెంట్‌తోపాటు, సంబంధిత నియంత్రణా సంస్థలు పరిశోధించాలని, ఇన్వెస్టర్లకు న్యాయం చేయాలని తాను దాఖలు చేసిన కేసులో ఇన్వెస్టర్ కోరారు. షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా రూ.1,700 కోట్లను వినియోగించారని, ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడా చెప్పలేదని ఆరోపిస్తూ, ఈ చర్య మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇన్వెస్టర్ స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే, మరోవైపు బుధవారం కూడా ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు ఇంకో 8 శాతం పతనమయ్యాయి. దీంతో బీఎస్‌ఈలో షేరు ధర రూ.621.15 వద్ద ముగిసింది. ఫలితంగా 100 మోస్ట్ వాల్యుడ్ సంస్థ జాబితాలో స్థానం పోగొట్టుకుంది.