ShrutiRamachandran: నటిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలు.. ఎవరీ శృతి రామచంద్రన్..?

ShrutiRamachandran: నటిస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలు.. ఎవరీ శృతి రామచంద్రన్..?

శృతి రామచంద్రన్ (Shruti Ramachandran).. చూడ్డానికి ఎంతో నేచురల్​గా, పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది. ఆమె ఎంచుకునే పాత్రలు, కథలు.. ఎక్కువకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి. హీరోయిన్​గా కెరీర్ స్టార్ట్ చేసినా అలాగే కొనసాగాలనే ఆంక్షలేం పెట్టుకోకుండా నచ్చిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తుంటుంది. శృతి నటిస్తుందంటే ఆ పాత్ర కాస్త ప్రత్యేకంగా ఉంటుందనేలా చేసింది ఆమె. మల్టీ టాలెంటెడ్​ అయిన శృతి తన టాలెంట్స్​ని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తుంటుంది. 

తమిళనాడులోని చెన్నైలో పుట్టింది శృతి రామచంద్రన్​. తర్వాత వాళ్ల ఫ్యామిలీ అంతా కొచ్చికి షిఫ్ట్​ అయింది. అందువల్ల ఆమె చెన్నై, కొచ్చిలలో స్కూల్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆర్కిటెక్చర్​ చదివింది.  సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్ట్ రూమ్ డ్రామాలో శ్రుతి రామచంద్రన్ కీలక పాత్రలో నటించింది. ఇటీవలే ఈ సినిమాతో ఆడియెన్స్​ను పలకరించింది. మరి ఆమె జర్నీ విశేషాలేంటో శృతి మాటల్లోనే...

‘‘నా మొదటి సినిమా మలయాళం ‘న్యాన్​’.అందులో దుల్కర్​ సల్మాన్​తో కలిసి నటించా. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే.. ఒకసారి రోజూలానే నేను డాన్స్ నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్లా. నా డాన్స్ చూసిన డైరెక్టర్ రంజిత్ సినిమాలో నటించమని నన్ను అడిగాడు. నేను చేయలేను అనుకుంటూనే సెట్​కి వెళ్లా.

ఎందుకంటే సినిమా తీయడం అనేది పెద్ద గొప్పేం కాదని అప్పట్లో నా ఫీలింగ్ . దాంతో నాకు వచ్చిన అవకాశానికి తగిన కృతజ్ఞత కూడా చూపించలేకపోయా. ప్రతి ఒక్కరికీ ఇలా ఈజీగా చాన్స్​ రావడం అసంభవం. ఒక డాన్స్​ క్లాస్​కి వెళ్తే వెంటనే సినిమాలో అవకాశం రావడం అనేది ఎవరూ ఊహించరు కూడా. అలాంటి సంఘటన నాకు జరగడంతో సినిమాలో చాన్స్ ఈజీగానే వస్తుందనే భావనతో ఉండేదాన్ని. ఆ తర్వాతే అర్థమైంది ఇది ఎంత పెద్ద అవకాశమో!

పెండ్లి అయ్యాక ‘ప్రేతమ్’​లో..

మొదటి సినిమా తర్వాత నేను ఆర్కిటెక్చర్​లో మాస్టర్స్ పూర్తి చేశాను. ముంబైలోని ఒక కాలేజీలో టీచింగ్ జాబ్​ చేశాను. పెండ్లి అయ్యాక కూడా ముంబై వెళ్లాలనుకున్నా. అప్పుడే ‘ప్రేతమ్’​లో ఆఫర్ వచ్చింది. ఈ ఆపర్చ్యునిటీ కూడా అనుకోకుండానే వచ్చింది. ఈ సినిమాలో లీడ్​ యాక్టర్, ప్రొడ్యూసర్​ అయిన జయసూర్య నన్ను జిమ్​లో చూసి ‘గోస్ట్​లా నటించగలవా?’ అని అడిగారు.

మొదట్లో నేను ‘నో’చెప్పాలనే అనుకున్నా. ఎందుకంటే నేను ఆ పాత్రను ఎంజాయ్​ చేయలేను అనిపించింది. అప్పుడు ఫిల్మ్​ డైరెక్టర్​ రంజిత్ నాకు మళ్లీ ఫోన్​ చేశారు. కొత్తవాళ్లతో ఆయన చాలా బాగా మాట్లాడతారు. అలా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ కూడా. అలా ఆయనతో డిస్కస్ చేశాక, ఈ సినిమాలో నటించాను. ఇంకా చెప్పాలంటే.. సినిమాలపై అప్పటివరకు ఉన్న నా ఆలోచనను మార్చేసిన ప్రాజెక్ట్ అది. 

కెరీర్ కన్​ఫ్యూజన్:

కెరీర్​ గురించి ఒక నిర్ణయానికి రావడం అంత ఈజీ కాదు. ఆ టైంలో నేను రెండు రకాల ఆలోచనలతో ఉన్నా. ఆర్కిటెక్చర్​ చేయాలా? లేక చేతిలో సినిమాలు ఉన్నాయి.. ఇదే కంటిన్యూ చేయాలా? అని. ఆ సమయంలో మా హస్బెండ్ ఫ్రాన్సిస్ థామస్ నేను సరైన నిర్ణయం తీసుకోవడానికి సాధనంగా పనిచేశారు. ఒక ఏడాదిపాటు కొచ్చి వెళ్లాలనుకున్నారాయన. అది ఇప్పుడు ఐదేండ్లు అయింది. 

ఎన్నో ఏండ్ల బంధం మాది:

నాకు చదవడం అంటే బాగా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఫ్రాన్సిస్​ రచనలకు నేను ఫ్యాన్‌ని. అతను అడ్వర్టైజింగ్​లో కాపీరైటర్​గా పనిచేశారు. మేం14 ఏండ్లుగా కలిసి పెరిగాం. అతని రచనలు, తను ఎదిగిన విధానమంతా నేను కళ్లారా చూశాను. ఫ్రాన్సిస్ రాసిన ఒక ‘అన్వేషణమ్’అనే మలయాళ డ్రామాలో నేనూ నటించా. ఆ ప్రాజెక్ట్ తర్వాత తనకి పెద్ద డైరెక్టర్స్​ నుంచి అవకాశాలు వచ్చాయి. 

‘మధురం’ ఇచ్చిన మెమొరీస్:

నేను ఇండస్ట్రీకి వచ్చిన ఐదేండ్ల తర్వాత ‘మధురం’లాంటి మంచి ఎక్స్​పీరియెన్స్ దక్కింది. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ‘మధురం’ఎప్పుడు రిలీజ్ అవుతుందో చివరివరకు నాకు తెలియదు. ఓటీటీలో రిలీజ్​ అయిందని తెలియగానే నిజమా? కలా? అన్నట్లు ఉండిపోయా.

ఓటీటీ ప్లాట్​ఫాం నాకు చాలా గ్రేట్​ అనిపిస్తుంది. ‘మధురం’ సినిమా టైంలో చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇది నా పదో సినిమా. ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకున్న పాత్ర కూడా ఇదే. వాళ్ల ప్రశంసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటివరకు నా కెరీర్​లోనే అలాంటి అప్రిసియేషన్​ అందుకోలేదు.

నిజానికి ఆ మూవీ డైరెక్టర్​ అహ్మద్​ కబీర్​తో కలిసి వర్క్​ చేయాలని ఎప్పటినుంచో ఆశ ఉండేది. అది ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా బిర్యానీ గురించే మాట్లాడుకోవాలి.

అప్పట్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు బిర్యానీ ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఈ సినిమా కారణంగా పది రోజులు ఒక హోటల్​లో షూటింగ్ చేసినప్పుడు రోజూ బిర్యానీ తినాల్సి వచ్చింది. ఎంత బిర్యానీ తిన్నానో కూడా గుర్తులేదు. రోజూ ఉదయం 7:30 గంటలకు బిర్యానీ తినడంతో షూటింగ్ మొదలవుతుంది. మొదటి రెండు రోజులూ చాలా ఇంట్రెస్ట్​గా అనిపించింది. కానీ, మూడోరోజుకే విసుగొచ్చేసింది.

రోజూ తినడం వల్ల నా బాడీ కూడా అడ్జస్ట్​ చేసుకోలేకపోయింది. కష్టంగా అనిపించింది కానీ, దాని గురించి కంప్లయింట్ చేయలేదు. అయితే ఈ క్రమంలో రీటేక్స్ కూడా చాలా అయ్యేవి. ఉదయం బిర్యానీ తినడం వల్ల మధ్యాహ్నం ఆకలి వేసేది కాదు. ఏదేమయినా నిజానికి అవన్నీ నేను ఎంజాయ్​ చేసిన మూమెంట్స్ అని చెప్పొచ్చు​. ఒక్క సారి స్క్రిప్ట్ విని ఓకే చేసిన సినిమా కూడా ఇదే. 

నా విజన్ నాకుంటుంది:

నేను కథ వినేటప్పుడు ఒక రైటర్​ ఆలోచన నుంచి వచ్చిన పాత్రగానే చూస్తాను. కానీ, చాలాసార్లు మీ లైఫ్​లో ఏది జరిగినా అవి మిగతా అంశాల మీద ఇన్​ఫ్లుయెన్స్ చూపిస్తాయి. దానివల్ల మా యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు.. నేను ఏదైనా పాత్రలో నటించేటప్పుడు ఆ క్యారెక్టర్​ వెనక కథలన్నింటిపై వర్క్ చేస్తాం. అలాగే నేను రాస్తున్నప్పుడు యాక్ట్​ చేస్తుంటాను. నాక్కూడా స్క్రిప్ట్​ విషయంలో ఒక విజన్ ఉంటుంది. ఆ రకంగా అర్థం చేసుకుంటా. 

డబ్బింగ్ ఆర్టిస్ట్​గా అవార్డు!

‘కమల’ సినిమాలో టైటిల్​ రోల్​కు డబ్బింగ్ చెప్పడానికి వెతుకుతున్నప్పుడు నేను రంజిత్​తో నా రెండో సినిమా ప్రేతమ్ చేస్తున్నాను. అప్పుడు తను నన్ను ఈ పాత్రకు డబ్బింగ్ చెప్తావా అని అడిగారు. నేను సరే చెప్తాను అన్నాను. టీంతో నేను చాలా కంఫర్టబుల్​గా ఉంటాను కాబట్టి నాకు ఇదొక టాస్క్​లా మాత్రమే అనిపించింది.

కమల పాత్రకి చాలా వేరియేషన్స్​ ఉంటాయి. అవన్నీ నేను డబ్బింగ్​లో చూపించాలి. ఆ పాత్రలో నటించిన రుహానీ చాలా బాగా చేసింది. డబ్బింగ్ చెప్పాలంటే నేను కొంత ఒత్తిడికి గురయ్యా. కానీ, అవార్డ్ వస్తుందని మాత్రం అనుకోలేదు. నిజానికి వేరొక యాక్టర్​కి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. ఈ సినిమా తర్వాత నేను‘అన్వేషణమ్’​కి డబ్బింగ్ చెప్పా. 

తెలుగు, తమిళంలో వెబ్​ సిరీస్​ల్లోనూ నటించా. తెలుగులో నటించేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నా పర్ఫార్మెన్స్​కి భాష అడ్డంకి కాకూడదని దాన్ని అధిగమించడానికి ప్రయత్నించా. వేరే భాషలో నటించాలనుకుంటే ముందు ఆ భాష నేర్చుకోవడం ఉత్తమమైన పని. సురేష్ గోపి నటించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్ట్ రూమ్ డ్రామాలో శ్రుతి రామచంద్రన్ కీలక పాత్రలో నటించింది.