తమిళనాడులో భారీ వర్షాలు.. గ‌ర్భిణి, చిన్నారిని ర‌క్షించిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్

తమిళనాడులో భారీ వర్షాలు.. గ‌ర్భిణి, చిన్నారిని ర‌క్షించిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్

త‌మిళ‌నాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి, తూత్తుకుడి, తిరునేల్‌వేలి, టెన్‌కాశీ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లాల్లో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టింది. వ‌ర‌ద‌లో చిక్కుకున్న ఓ గ‌ర్భిణి, చిన్నారిని ఆర్మీ హెలికాప్టర్‌లో మ‌ధురైకి త‌ర‌లించారు. ఆ చిన్నారి వ‌య‌స్సు ఒక‌టిన్నర ఏండ్లు అని ఆర్మీ అధికారులు తెలిపారు. మ‌రో న‌లుగురు ప్రయాణికుల‌ను కూడా ర‌క్షించారు. 

త‌మిళ‌నాడులో కురుస్తోన్న భారీ వ‌ర్షాల‌కు ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. చాలామంది నిరాశ్రయులయ్యారు. ఈ నాలుగు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెప్పారు. ఈ నాలుగు జిల్లాల‌కు అధికారులు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, ఇత‌ర విప‌త్తు బృందాలు రంగంలోకి దిగాయి. 

వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో చ‌ర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. వారికి పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇత‌ర నిత్యవ‌స‌రాల‌ను అంద‌జేస్తున్నారు.