కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. బెంగాల్‌ సీఎంకు డాక్టర్‌‌ లేఖ

కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. బెంగాల్‌ సీఎంకు డాక్టర్‌‌ లేఖ
  • జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన ఎన్నారై

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అత్యంత ప్రాణాంతకమని ఇండియన్‌ – అమెరికన్‌ డాక్టర్‌‌ ఇంద్రనీల్‌ బసూరాయ్‌ అన్నారు. వ్యాధికి సంబంధించి నిర్లక్ష్యం వహించొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఆయన లెటర్‌‌ రాశారు. “ పశ్చిమ బెంగాల్‌లో జనాభా ఎక్కువగా ఉన్నందున వైరస్‌ ఒక ప్రాంతానికి సోకితే.. అది కార్చిచ్చులా వ్యాపిస్తుంది. వేలాది మంది వ్యాధి భారిన పడి చనిపోయే అవకాశం ఉంది. సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా కఠిన చర్యలు తీసుకోంది. ఈ డేంజర్‌‌ వైరస్‌ను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించండి. నిర్లక్ష్యం వహిస్తే వందలాది మంది చనిపోతారు” అని డాక్టర్‌‌ లెటర్‌‌లో చెప్పారు. ఈ వైరస్‌ మనుషులను చంపే మిషన్ అని అభిప్రాయపడ్డారు. టెస్టులు పెంచాలని, ఐసోలేషన్‌ కాంటాక్ట్స్‌ను గుర్తించాలని, లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలని సూచించారు. వైరస్‌ను వ్యాప్తి చెందకుండా చేస్తారని అనుకుంటున్నాను. విధ్వంసానికి దారితీసే పరిస్థితులను నా రాష్ట్ర సీఎం తీసుకురాదని అనుకుంటున్నాను అని ఆయన లెటర్‌‌లో పేర్కొన్నారు. మనదేశానికి చెందిన డాక్టర్‌‌ రాయ్‌ యూఎస్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. యూఎస్‌, మన దేశంలోని చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌‌గా కూడా పనిచేశారు.