బిగ్ బీ మాకు దేవుడి కంటే తక్కువేం కాదు

 బిగ్ బీ  మాకు దేవుడి కంటే తక్కువేం కాదు

అమెరికా న్యూజెర్సీలో నివసించే గోపీ సేథ్‌...  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పై  తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. బిగ్ బీ విగ్రహాన్ని పెద్ద గాజు బాక్స్ లో తన ఇంటిముందు అవిష్కరించాడు. ఈ వేడుకకు సుమారుగా 600 మంది హాజరై సందడి చేశారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో బిగ్ బీ కూర్చునే లుక్ లో ఈ విగ్రహాం ఉంది. రాజస్థాన్ లో ఈ విగ్రహాన్ని రెడీ చేసి అమెరికాకు తరలించారు. సుమారుగా దీనికి రూ. 60 లక్షల ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది.

అమితాబ్ బచ్చన్ అంటే తమ కుటుంబానికి ఎంతో అభిమానమని,  ఆయన తమకు దేవుడి కంటే తక్కువేం కాదని గోపీ సేథ్‌ తెలిపారు. 1991లో న్యూజెర్సీలో జరిగిన నవరాత్రి వేడుకల సందర్భంగా తాను తొలిసారిగా బిగ్ బీని కలిసినట్టుగా  గోపీ సేథ్ చెప్పారు. అప్పటి నుంచి ఆయనకు వీరాభిమానిగా మారినట్లుగా ఆయన తెలిపాడు. రీల్ లైఫ్ లోనే కాదు... రియల్ లైఫ్ లోనూ బిగ్ బీ నడుచుకునే, మాట్లాడే విధానం తనలో స్ఫూర్తిని నింపిందని, ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికి అమితాబ్ ఒదిగి ఉండే మనిషి అని తెలిపారు. అందుకే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.

1990లో గుజరాత్‌ నుండి అమెరికాకు వెళ్లిన గోపీ  సేథ్.. గత మూడు దశాబ్దాలుగా అమితాబ్ అభిమానుల కోసం "బిగ్ బి ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ" అనే వెబ్‌సైట్‌ను కూడా నడుపుతున్నారు.