
- భూ వాతావరణానికి శరీరం అలవాటుపడేందుకే..
- హెల్త్ కండీషన్, ఫిట్‌నెస్‌పై ఇస్రో డాక్టర్ల పర్యవేక్షణ
- 15వ తేదీన కాలిఫోర్నియా కోస్టల్ ఏరియాలో ల్యాండింగ్
న్యూఢిల్లీ: యాక్సియం 4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లిన ఇండియన్ అస్ట్రొనాట్ శుభాంశు శుక్లా భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తారు. ఈ నెల 15న శుక్లా భూమికి రానున్నారు. స్పేస్ నుంచి బయల్దేరే ముందు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. 14వ తేదీ మధ్యాహ్నం 2.25 గంటలకు స్పేస్‌క్రాఫ్ట్‌లో ఎంటర్ అవుతారు. ఆ తర్వాత స్పేస్‌క్రాఫ్ట్ అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4.35 నిమిషాలకు భూమివైపు జర్నీ స్టార్ట్ చేస్తారు.
మరుసటి రోజు 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియాలోని కోస్టల్ ఏరియాలో శుక్లాతో పాటు మరో ముగ్గురు అస్ట్రొనాట్లు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులు ల్యాండ్ అవుతారు. అస్ట్రొనాట్లను 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. స్పేస్‌లో గ్రావిటీ ఉండదు. ఇక్కడికొచ్చాక శుక్లా భూ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్లా హెల్త్ కండీషన్, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. స్పేస్‌లో శుభాంశు శరీరంపై పడిన ప్రభావంపై అధ్యయనం చేస్తారు.
శరీరంలో రక్త ప్రవాహం, గుండెతో పాటు మెదడు పనితీరును స్పేస్ జర్నీ ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను పరిశీలిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ గంటకు 28వేల కిలో మీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. భూ వాతావరణంలో ప్రవేశించాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. కాగా, నలుగురు అస్ట్రొనాట్లు గతనెల 25న ఐఎస్ఎస్కు బయలుదేరి వెళ్లారు. 18 రోజుల పాటు అందులోనే ఉన్నారు. రెండు వారాల్లో శుక్లా దాదాపు 96.5 లక్షల కిలో మీటర్లు ప్రయాణించాడు. 230 సార్లు భూమి చుట్టూ తిరిగారు.