ప్రపంచంలోనే పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డులో మన అబ్బాయి

ప్రపంచంలోనే పొడవైన జుట్టు.. గిన్నిస్ రికార్డులో మన అబ్బాయి

15 ఏళ్ల యూపీ టీనేజర్ అత్యంత పొడవాటి జుట్టును కలిగి ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రస్తుతం అతని రికార్డుకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఈరోజుల్లో ఉన్న జుట్టును కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు.. ఈ కాలుష్యల వల్ల జుట్టు మొత్తం ఊడుతుంది.. ఇక కొత్త జుట్టు పెరగడం అనేది అసలు సాధ్యం కావడం లేదని చాలా మంది వాపోతున్నారు.. కానీ ఓ యువకుడు మాత్రం పొడవాటి జుట్టును పెంచి గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు.. ఆ కుర్రాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల యువకుడు సిదక్‌దీప్ సింగ్ చాహల్ అత్యంత పొడవాటి జుట్టు కలిగిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ వరల్డ్ రికార్డ్స్ (GWR) యూట్యూబ్‌లో సిదక్‌దీప్ సింగ్ చాహల్ వీడియోను షేర్ చేసింది. క్లిప్‌లో చాహల్ చిన్నప్పుడు తన పొడవాటి జుట్టుతో ఎంత హ్యాపీగా ఉన్నాడో.. తరువాత వద్దని తల్లిదండ్రులను ఎలా రిక్వెస్ట్ చేసాడో వివరించాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 15 ఏళ్ల సిదక్‌దీప్‌ సింగ్ చాహల్‌ తన జీవితంలో ఇప్పటివరకు తన జుట్టును కత్తిరించుకోలేదు.. అదే ఇప్పుడు అతనికి అరుదైన గుర్తింపును తెచ్చిపెట్టింది.. ప్రపంచంలోనే అతి పొడవైన జుట్టు ఉన్న కుర్రాడిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ 2024 బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ అధికారికంగా ప్రకటిస్తూ.. సిదక్‌దీప్‌ వీడియోను షేర్‌ చేసింది.

 సిక్కు మతాన్ని అనుసరించే చాహల్ తన మత విశ్వాసాలను గౌరవించడం కోసం ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోలేదట.  ప్రస్తుతం అతని జుట్టు 146 సెంటిమీటర్ల (4 అడుగుల 9.5 అంగుళాలు) పొడవు పెరిగింది.ఈ రికార్డు దక్కడం పట్ల సిదక్‌దీప్‌ ఆనందం వ్యక్తం చేశాడు. చాహల్ జుట్టును ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో వీడియోలో వివరించాడు. అందుకోసం తన తల్లి చేసే సాయాన్ని పంచుకున్నాడు. చాహల్ రికార్డు గురించి విన్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం బాలుర విభాగంలో చాహల్ పొడవాటి జుట్టుతో తన రికార్డును పదిలం చేసుకున్నాడు.

చిన్నప్పుడు తన  జుట్టును చూసి  స్నేహితులు ఏడిపించేవారని చాహల్ అన్నాడు . దీంతో జట్టు కత్తిరించుకుంటానని ఇంట్లో గొడవ చేసేవాణ్ని. కానీ, ఆ తర్వాత దీనిపైతనకు ఇష్టం పెరిగిందన్నాడు. ఇప్పుడు ఇది తన జీవితంలో ఒక భాగమైందని తెలిపాడు. అయితే, జుట్టు పెంచుకోవడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తా. అందుకు కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి తన తల్లి  సాయం చేస్తుంది.. తనకు రికార్డ్ వచ్చిందంటే  ఇంకా నమ్మలేకున్నా.. ఇప్పుడు నేను సంతోషంగా ఫీల్ అవుతున్నా నని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.