- హైఎండ్ మోడల్స్కు ఎక్కువ గిరాకీ.. కొనుగోలు శక్తి పెరగడమే కారణం
- రూ.30 వేలకు పైబడిన వాటికి మస్తు డిమాండ్
న్యూఢిల్లీ: కొంటే ఖరీదైన ఫోనే కొనాలి.. లేకుంటే లేదు! మనదేశంలో ఎక్కువ మంది కస్టమర్ల ఆలోచన విధానం ఇలాగే ఉంది. కస్టమర్ల కొనుగోలు శక్తి పెరగడం ఈ మార్పుకు ప్రధాన కారణం. గతంలో బడ్జెట్ ఫోన్లు మాత్రమే మార్కెట్లను శాసించేవి. ఇప్పుడు వినియోగదారులు రూ.30 వేలకు పైబడిన ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మనదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యాక్టివ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌గా అవతరించింది.
ప్రస్తుతం 74 కోట్ల కంటే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. 2025 లెక్కల ప్రకారం, మొబైల్ అమ్మకాల సంఖ్య కేవలం ఒక శాతమే పెరిగినప్పటికీ, వాటి విలువ మాత్రం ఎనిమిది శాతం పెరిగింది. జనం తక్కువ ధర గల ఫోన్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. యాపిల్, శామ్‌సంగ్ వంటి టాప్ కంపెనీలు ఈ మార్పును ముందుండి నడిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఐఫోన్ వాడకం భారతీయులలో హోదాకు చిహ్నంగా మారింది. ఈ మార్పుకు సులభమైన ఈఎంఐ పద్ధతులు ఒక ముఖ్యమైన కారణం. నెలవారీ వాయిదాల రూపంలో డబ్బు చెల్లించే వెసులుబాటు ఉండటం వల్ల సామాన్యులకు కూడా ఖరీదైన ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. పాత ఫోన్లను మార్చుకునే ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఈ పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. దీని మొబైల్ కంపెనీల ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తోంది.
వివో నంబర్‌వన్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షేర్ పరంగా చూస్తే వీవో 20 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఆదాయం పరంగా చూస్తే యాపిల్ 28 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. రూ.30 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం ఫోన్ల విభాగం 11 శాతం వృద్ధి సాధించింది. ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి ప్రీమియం ఫోన్ కావడం విశేషం. రూ.20 వేల కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ల మార్కెట్ వాటా గతంలో 38 శాతంగా ఉండగా, అది ఇప్పుడు 29 శాతానికి పడిపోయింది.
రూ.10 వేల లోపు ఉండే ఫోన్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. రూ.50 వేల కంటే ఎక్కువ ధర ఉన్న అల్ట్రా ప్రీమియం ఫోన్ల వాటా 17 శాతానికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. యాపిల్ ఐఫోన్ 16 మోడల్ 2025లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. సాధారణంగా కస్టమర్లు ఫోన్ కొన్న తర్వాత రెండున్నర ఏళ్లకే మార్చేవారు. ఇప్పుడు ఆ సమయం దాదాపు నాలుగేళ్లకు పెరిగింది. మెమరీ, ఇతర విడిభాగాల ధరలు పెరగడం వల్ల 2026లో ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
