GST Effect : దసరా పండక్కి.. పాత సరుకు వదిలిచ్చేసుకుంటున్న కార్ల కంపెనీలు

GST Effect : దసరా పండక్కి.. పాత సరుకు వదిలిచ్చేసుకుంటున్న కార్ల కంపెనీలు

ఈ ఏడాది మెుదటి ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్ కంపెనీలు తమ వద్ద అమ్ముడుపోని స్టాక్ భారీగా పేరుకుపోయిందని నివేదించిన సంగతి తెలిసిందే. దీంతో మారుతీ, టాటా, మహీంద్రా, హోండా, హుందయ్ సహా మరిన్ని కంపెనీల వద్ద దాదాపు 4 లక్షల వరకు అమ్ముడుపోని కార్లు ఉన్నట్లు వివిధ రిపోర్టుల ద్వారా వెల్లడైంది. వీటి విలువ ఏకంగా రూ.79 వేల కోట్లుగా ఉన్నట్లు తేలింది. అమ్మకాలు తక్కువగా ఉండటంతో సగటున రోజుకు 62 నుంచి 67 కార్ల వరకు ఇన్వెంటరీని డీలర్ల కోసం కలిగి ఉన్నాయి.

దీంతో ఒకానొక సమయంలో దేశంలోని కార్ల డీలర్లు భారీగా అమ్ముడుపోని స్టాక్ కోసం డబ్బు వెచ్చించి అమ్మకాలను పెంచుకోవటానికి నానా తంటాలు పడ్డారు. ప్రధానంగా ఎస్యూవీలు అమ్ముడుపోని కేటగిరీలో ఎక్కువయ్యాయి ఆ సమయంలో. కట్ చేస్తే కేవలం 3 నెలల కాలంలోనే కథ మెుత్తం మారిపోయింది. భారీగా జీఎస్టీ పన్నులు, ప్రజలపై అనవసరపు టాక్సులు వేయటం వల్ల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని.. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించిందని గ్రహించిన మోడీ సర్కార్ రిజర్వు బ్యాంక్ గవర్నర్ మార్పు నుంచి బ్యాంక్ వడ్డీ రేట్లు, ఆదాయపు పన్ను పరిమితి పెంపు.. ప్రస్తుతం జీఎస్టీ సంస్కరణలు అంటూ అడ్డగోలుగా వేసిన పన్నులను తగ్గించటం వరకూ వరుస నిర్ణయాలతో తప్పులను సరిదిద్దుకుంటూ వచ్చింది. 

►ALSO READ | VIDA EV: ఈవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. విడా ఈవీల బ్యాటరీ వారెంటీ 5 ఏళ్లకు పెంపు..

దీని ఫలితంగా సెప్టెంబర్ 22 నుంచి మార్చబడిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కంపెనీలు తగ్గింపులను నేరుగా ప్రజలకు పాసాన్ చేయటంతో చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో రికార్డ్ సేల్స్ నమోదు చేస్తున్నాయి కార్ల కంపెనీలు. ఇదే క్రమంలో టూవీలర్ విక్రయాలు కూడా భారీగానే పెరిగినట్లు వెల్లడైంది. ప్రస్తుతం దసరా నవరాత్రుల సమయంలో కార్ల రేట్లు పన్ను తగ్గింపుల కారణంగా అందుబాటులోకి రావటంతో ప్రజలు ఎగబడి షోరూంలకు వెళుతున్నారు. రికార్డు స్థాయిలోనే నవరాత్రి మెుదటి రోజున ప్రధాన మూడు ఆటో కంపెనీలు ఏకంగా 51వేల కార్లను అమ్మేశాయి. ఇలా పండుగ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన బూస్టుతో కంపెనీలు తమ వద్ద ఉన్న పాత స్టాక్ మెుత్తం క్లియర్ చేసుకుంటున్నాయి. 

సెప్టెంబర్ 22న వివిధ కార్ల కంపెనీలు అమ్మకాల వివరాలు..

  • మారుతీ సుజుకీ : 30వేల కార్లు
  • టాటా మోటార్స్ : 10వేల కార్లు
  • హ్యుందాయ్ : 11వేల కార్లు

అయితే మిగిలిన కంపెనీలు తమ సేల్స్ డేటా బయటపెట్టలేదు. నిపుణులు మాత్రమే మెుత్తం మీద లక్ష కార్ల వరకు అమ్ముడై ఉంటాయని అంచనా వేస్తున్నారు కేవలం సెప్టెంబర్ 22 ఒక్కరోజునే. మెుత్తం మీద కంపెనీలు కూడా తమ వద్ద ఉన్న స్టాక్ క్లియర్ చేసుకుంటున్నాయి. కొందరు దీనిపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ.. అసలు జనం ఎగబడి కొంటున్నవి కొత్త కారులా లేక కొత్తవనుకుంటున్న పాత కారులా అంటున్నారు.