సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం..తీర ప్రాంత గస్తీ మరింత బలోపేతం

సముద్ర ప్రతాప్ నౌక జలప్రవేశం..తీర ప్రాంత గస్తీ మరింత బలోపేతం

తొలి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌకను ప్రారంభం
60 శాతానికిపై గా స్వదేశీ విడిభాగాలతో తయారీ: రాజ్​నాథ్​

భారత తీరరక్షక దళానికి చెందిన మొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం గోవాలో ఈ నౌకను ప్రారంభించారు. ఈ నౌక తయారీలో 60% భాగాలు దేశీయంగా తయారుచేసినవే.

పణజి: భారత తీరరక్షక దళానికి చెందిన మొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్ర ప్రతాప్’ జలప్రవేశం చేసింది. రక్షణ మంత్రి రాజ్‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్ సోమవారం గోవాలో ఈ నౌకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశలో బలమైన అడుగు అన్నారు. 

ఈ నౌక తయారీలో 60 శాతం భాగాలు దేశీయంగా తయారుచేసినవేనని, భవిష్యత్తులో దీనిని 90 శాతం వరకు చేయాలని లక్ష్యమని చెప్పారు. సముద్ర కాలుష్యం తీవ్ర సవాలుగా మారుతోందని, అది చేపల వేటగాళ్ల జీవనోపాధి, తీర ప్రాంత ప్రజల భవిష్యత్తు, రాబోయే తరాల భద్రతను ప్రభావితం చేస్తుందని అన్నారు. 

సముద్ర వనరులు, మానవత్వం ఉమ్మడి వారసత్వమని, భారత్ బాధ్యతాయుత సముద్రశక్తిగా మారిందని తెలిపారు. సముద్ర పర్యావరణ రక్షణ వ్యూహాత్మక అవసరమని, నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. మోడర్న్ ఎకో రెస్పాన్స్ కెపాసిటీ కలిగిన దేశాల్లో భారత్ అగ్రభాగాన నిలుస్తుందని, స్వచ్ఛమైన సముద్రాలు సురక్షిత వాణిజ్యాన్ని, జీవితాలను, స్థిరమైన సముద్ర వాతావరణాన్ని నిర్ధారిస్తాయని అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు.

కఠిన పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది

సముద్ర ప్రతాప్ నౌకను గోవా షిప్‌‌‌‌‌‌‌‌యార్డ్ లిమిటెడ్  నిర్మించింది. భారత్‌‌‌‌‌‌‌‌లో తయారైన అతిపెద్ద, అత్యాధునిక కాలుష్య నియంత్రణ నౌకగా ఇది గుర్తింపు పొందింది. అధునాతన పొల్యూషన్ ఐడెంటిఫికేషన్​ సిస్టమ్స్, స్పెషల్​బోట్లు, ఆధునిక అగ్నిమాపక పరికరాలు, హెలికాప్టర్ హ్యాంగర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 

సముద్రాల్లో ఎదురయ్యే కఠిన పరిస్థితులలో కూడా పనిచేయగలగడం దీని ప్రత్యేకత. సముద్ర కాలుష్య నియంత్రణ, శోధన, -రక్షణ పనులు, సముద్ర చట్టాల అమలు, దేశ ఆర్థిక మండలి రక్షణతో పాటు తీరప్రాంత గస్తీ, సుదూర నిఘా కార్యకలాపాలు, సముద్ర భద్రత వంటి పనులు ఇది నిర్వహిస్తుంది. ఆయుధాలుగా 30 ఎంఎం సీఆర్ఎన్91 గన్, రెండు 12.7 ఎంఎం రిమోట్ కంట్రోల్ గన్స్ ఉన్నాయి.

 డిప్యూటీ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ భామా ఈ నౌకకు కమాండింగ్ అధికారిగా నియమితులయ్యారు. ఇందులో14 మంది ఆఫీసర్లు, 115 మంది సిబ్బంది ఉంటారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేశ్​శివమణి హాజరయ్యారు.