రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో రూ.425 కోట్ల విలువైన 61 కేజీల డ్రగ్స్​ను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ (ఐసీజీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎస్‌ అధికారుల సమాచారం మేరకు ఐసీజీ దళాలు రెండు ఫాస్ట్‌ పెట్రోల్‌ క్లాస్‌ షిప్స్‌ ఐసీజీఎస్‌ మీరా బెన్‌, అభిక్ సాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐసీజీ దళాలు సోమవారం రాత్రి అరేబియా సముద్రంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓఖా కోస్ట్​కు సుమారు 340 కిలోమీటర్ల దూరంలో ఇండియన్‌ జలాల్లో ఓ బోట్‌ అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది.

వెంటనే పెట్రోలింగ్‌ షిప్స్‌ ఆ బోట్‌ను వెంబడించి, పట్టుకున్నాయి. అందులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.425 కోట్ల విలువైన డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురు ఇరాన్‌ దేశస్తులు అని అధికారులు వెల్లడించారు. వీరిని ఓఖా కోస్ట్​కు తరలించి, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గడిచిన 18 నెలల్లో ఏటీఎస్‌ సమన్వయంతో ఐసీజీ 8 విదేశీ నౌకలను పట్టుకోవడంతో పాటు రూ.2,355 కోట్ల విలువ చేసే 407 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.