న్యూఢిల్లీ: స్టాండప్ కమెడియన్ యశ్ భరద్వాజ్‌కు దుబాయ్‌లో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ చిన్న ఇన్ స్టా రీల్ కారణంగా 47 రోజుల పాటు దుబాయ్‌లో బందీగా ఉన్నాడు. అనంతరం దుబాయ్ నుంచి అతడిని బహిష్కరించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యశ్ భరద్వాజ్ వెల్లడించాడు.
అసలు ఏం జరిగిందంటే..?
2026 మార్చిలో ఓ ఈవెంట్ కోసం స్టాండప్ కమెడియన్ యశ్ భరద్వాజ్ దుబాయ్ వెళ్లాడు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దుబాయ్‌లో గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయకపోవడంపై భరద్వాజ్ ఓ రీల్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో దుబాయ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉందన్న కారణంతో దుబాయ్ సీఐడీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని 47 రోజుల పాటు నిర్బంధ కేంద్రంలో ఉంచారు. అనంతరం ఇండియాకు డిపోర్ట్ చేశారు.
‘‘2026, మార్చి 19న దుబాయ్‌లో ఒక ఈవెంట్లో ఉన్నప్పుడు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు హాజరు కావాలని దుబాయ్ పోలీసుల నుంచి నాకు ఫోన్ వచ్చింది. దుబాయ్‌లో గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయకపోవడంపై తాను చేసిన కామెడీ రీల్‌కు సంబంధించి విచారణ కోసం పిలిచారని తెలిసింది. ఆ రీల్ జాతీయ భద్రతకు ముప్పుగా భావించి నన్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 47 రోజులు నిర్బంధ కేంద్రంలో ఉంచారు. అనంతరం ఇండియాకు డిపోర్ట్ చేశారు’’ అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని భరద్వాజ్ వివరించారు.
తాను మే 5న భారతదేశానికి తిరిగి వచ్చానని.. అప్పటి నుంచి ముంబైలోనే ఉంటున్నానని తెలిపారు. ఈ ఘటన నన్ను, నా కుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా, కొంతవరకు ఆర్థికంగా కూడా కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ చేదు అనుభవం నుంచి త్వరగానే బయటపడ్డామన్నారు.
