
- వాట్సాప్, సేల్స్‌ఫోర్స్ వంటి కంపెనీలకు
- ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఇండియన్ కంపెనీ
- ‘జోహో షో’లో కేంద్ర కేబినెట్ బ్రీఫింగ్..జోహో ప్రొడక్టివిటీ సూట్ వాడుతున్నానని మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన
- నాణ్యమైన సేవలను తక్కువ ధరలో అందిస్తామన్న కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వేంబు
న్యూఢిల్లీ: గ్లోబల్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ఇండియన్ కంపెనీ జోహో సవాల్ విసురుతోంది. సేల్స్‌ఫోర్స్, స్లాక్ వంటి కంపెనీలను ఢీకొట్టేందుకు రెడీ అంటోంది. ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తుండడంతో జోహో మరింతగా విస్తరించేందుకు సిద్ధమైంది.
"మైక్రోసాఫ్ట్ కంటే మెరుగైన సర్వీస్‌లను జోహో అందించగలదు”అని తాజాగా కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వేంబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ కంపెనీ క్లౌడ్, ఏఐ, బిజినెస్ సాఫ్ట్‌వేర్ సేవలను విస్తరిస్తోంది. ‘‘జోహో ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌తో పోటీపడగలిగే కొన్ని సంస్థలలో ఒకటిగా మారింది. జోహో వివిధ సర్వీస్‌లను అందిస్తోంది. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ సామర్థ్యాల్లో కస్టమర్లకు మైక్రోసాఫ్ట్ కంటే మెరుగైన అనుభవాన్ని అందిస్తోంది” అని వేంబు పేర్కొన్నారు.
జోహో, దాని ఐటీ విభాగమైన మేనేజ్‌ఇంజిన్ 2002 నుంచి ఎలా అభివృద్ధి చెందాయన్నది ఆయన ఎక్స్‌లో షేర్ చేసిన గ్రాఫ్ ద్వారా చూపించారు.
స్వదేశీ టెక్ అవసరం
ఇండియా గవర్నమెంట్ స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. తాను జోహో ప్రొడక్టివిటీ సూట్‌ను వాడుతున్నానని తాజాగా ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ ప్రకటించిన విషయం తెలిసిందే. అలానే కేబినెట్ బ్రీఫింగ్‌లో కూడా మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్‌కి బదులు జోహో షోని వాడారు. జోహోకు రాజకీయ స్థాయిలో మద్దతు లభిస్తుండడంతో, తమ ఇంజినీర్లు మెరుగైన సర్వీస్‌లను తీసుకొస్తారని వేంబు అన్నారు.
మైక్రోసాఫ్ట్‌తో పాటు సేల్స్‌ఫోర్స్, స్లాక్ వంటి సంస్థలపై కూడా ఆయన విమర్శలు చేశారు. సేల్స్‌ఫోర్స్ ఒక నాన్-ప్రాఫిట్ సంస్థకు అందించే సర్వీస్‌ల ధరను ఏడాదికి 5 వేల డాలర్ల నుంచి 2 లక్షల డాలర్లకి పెంచిందని, స్లాక్ సర్వీస్‌లు ఖరీదుగా మారాయని ఆయన పేర్కొన్నారు. జోహో తక్కువ ధరలో మెరుగైన సర్వీస్‌లను అందిస్తుందని, ఈ గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా మారిందని అన్నారు.
జోహో ఫ్యూచర్
జోహో నిజంగా మైక్రోసాఫ్ట్ స్థాయికి చేరాలంటే, కొన్ని కీలక అంశాల్లో మెరుగుదల అవసరం.
మైక్రోసాఫ్ట్‌లాగే విశ్వసనీయత, సైజ్, ఎక్కువ ఫీచర్లు ఉండాలి. కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని ఇవ్వాలి. భారత మార్కెట్‌లో విస్తరించిన జోహో, అంతర్జాతీయ సంస్థలకు కూడా సర్వీస్‌లు అందివ్వాలి. వీటి నమ్మకాన్ని పొందాలి. ఏఐ, క్లౌడ్, ఇంటిగ్రేషన్ వంటి రంగాల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను పెంచాలి. జోహో ప్రపంచ స్థాయిలో పోటీపడే స్థాయికి ఎదగాలని టార్గెట్ పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్‌కు ప్రత్యామ్నాయంగా మారగలదా అన్నది భవిష్యత్‌లో తెలుస్తుంది.
వాట్సాప్‌కు పోటీగా జోహో మెసేజింగ్ యాప్!
జోహో సంస్థ త్వరలో “అరట్టై” అనే కొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టనుంది. తక్కువ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు, నెమ్మదైన ఇంటర్నెట్ ఉన్న ప్రాంతాల్లో సులభంగా పనిచేసేలా దీనిని రూపొందించారు. ప్రతి ఒక్కరికీ టెక్నాలజీ నాలెడ్జ్‌ను అందుబాటులో ఉంచాలన్నదే అరట్టై లక్ష్యం అని శ్రీధర్ వేంబు అన్నారు.
అరట్టై ప్రత్యేకత..
- నెమ్మదైన లేదా అంతరాయం కలిగిన ఇంటర్నెట్‌లో కూడా మెసేజింగ్ సాఫీగా సాగుతుంది.
- తక్కువ ర్యామ్, ప్రాసెసింగ్ పవర్ ఉన్న ఫోన్లలో కూడా సులభంగా పనిచేస్తుంది.
- వేగవంతమైన లోడింగ్, సులభమైన ఇంటర్‌ఫేస్‌తో సులువుగా వాడుకోవచ్చు.
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు వాడడాన్ని ఎక్కువ డేటా అవసరమవుతుందని వేంబు అన్నారు. అరట్టై ద్వారా మారుమూల ప్రాంతాల్లో లక్షల మందికి మెసేజింగ్ సౌకర్యం అందిస్తామని చెప్పారు. అయితే, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడం వల్ల వాట్సాప్ స్థాయికి చేరడానికి ఇంకా సమయం పడుతుంది.