దళిత ఉద్యమం భారత రాజ్యాంగం పుట్టుకతోపాటు ఆత్మగౌరవం, మానవ హక్కుల క్షేత్రంలో దిశానిర్దేశం పొందింది. అంబేద్కర్ సిద్ధాంతం దళిత సమాజానికి స్పష్టమైన దిశ ఇచ్చింది. ‘విద్య పొందు, సంఘటితమవు, పోరాడు.’ అని స్పష్టం చేసింది. కానీ, బీసీ ఉద్యమం ఆలస్యంగా విభిన్న కులాల సమ్మేళనంగా మొదలైంది. దీనికి ఒకే సామూహిక చరిత్ర లేకపోవడం ప్రధాన సమస్య. సిద్ధాంత లోపం మరో సమస్య.
బీసీ ఉద్యమం దళిత ఉద్యమంలా ఒక స్పష్ట సిద్ధాంత కేంద్రీకరణను సాధించలేదు. దళిత ఉద్యమం అణచివేతకు వ్యతిరేకమైన మానవ హక్కుల సిద్ధాంతం మీద నిలబడి ఉంది. కానీ, బీసీ ఉద్యమం చాలాకాలం వరకు ‘రిజర్వేషన్లు ఇవ్వండి’ అనే కోణంలోనే పరిమితమైంది. కుల నిర్మూలన దిశగా ఆలోచన లేదు. రాజకీయ శక్తిని సామాజిక చైతన్యంగా మార్చే ఆలోచన చేయలేదు. బీసీలను ‘వెనుకబడినవారు’గా కాకుండా ఉత్పత్తి శక్తుల ప్రతినిధులుగా చూడలేదు. అగ్రకులాల వలస సిద్ధాంతానికి బలమైన ప్రత్యామ్నాయతత్వం రూపుదిద్దుకోలేదు. దళిత ఉద్యమానికి అంబేద్కరిజం ఉందనుకుంటే, బీసీ ఉద్యమానికి ఇంకా సమగ్ర బీసీవాద సిద్ధాంతం పుట్టలేదు.
ఆచరణ లోపం
బీసీ ఉద్యమం మాటల స్థాయిలో ఎక్కువగా, ఆచరణలో తక్కువగా ఉంది. బీసీ నాయకులు ఉన్నా వారు తమ పార్టీ లాభాలకే ఎక్కువ కట్టుబడి ఉన్నారు. ప్రతి కులం తనకే నాయకత్వం కోరుకోవడం. కుల కేంద్రీకరణ. ఉద్యమం సామూహిక ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితమైంది. విద్యావంతులైన బీసీలు ఉద్యమానికి దూరంగా ఉండటం. సాంస్కృతిక చైతన్యం లేకపోవడం వల్ల.. దళిత సాహిత్యం, దళిత కళా సంస్కృతిలా బీసీ సంస్కృతి బలపడలేదు. బీసీలకు ఎన్నో సంఘాలు ఉన్నా, ఒక ఐక్య ఫ్రంట్ లేదా కేంద్రీకృత దిశానిర్దేశం లేదు. దళితులందరూ ‘దళిత’ అనే సమగ్ర గుర్తింపులో కలిసిపోయారు.
కానీ, బీసీలు140కి పైగా కులాలుగా విడిపోయి ఉన్నారు. ఇది ఉద్యమానికి గొప్ప సామూహిక శక్తి అయినా సక్రమంగా మలచలేకపోయారు. బీసీ ఉద్యమం ఎప్పటికప్పుడు అధికార పార్టీల ‘ఓటు బ్యాంక్’ గా మారింది. ప్రతిపార్టీ బీసీల పేరుతో నాయకులను పెట్టి, ఉద్యమాన్ని తమ కక్ష్యలోకి తెచ్చుకుంది. దళిత ఉద్యమం పాలక పార్టీలతో డీల్ చేసుకునే స్థాయికి వెళ్లినా, తన స్వతంత్ర భావజాలాన్ని మాత్రం వదల్లేదు. బీసీ ఉద్యమం ఆ స్థిరత్వం సాధించలేదు.
బీసీ శక్తిగా మారాలి
బీసీలు ఆర్గనైజ్ కావాలంటే, బీసీ ఉద్యమం పునర్జన్మ పొందాలంటే కొన్ని మార్గాలు ఆచరించాలి. బీసీ అంటే వెనుకబడిన కులం అనే నిర్వచనాన్ని వదిలి ‘దేశ ఉత్పత్తి శక్తుల ప్రతినిధి’ అనే భావజాలం తీసుకోవాలి. దళిత, - బీసీ- మహిళా ఐక్యత ఆధారంగా కొత్త సామాజికతత్వం నిర్మించాలి. బీసీ యువతకు అంబేద్కర్, ఫూలే, పెరియార్, మధుకర్ తదితరుల ఆలోచనలు పరిచయం చేయాలి. సోషల్ మీడియా, పత్రికా వేదికల్లో తమ దృక్కోణాన్ని తరం చైతన్యంగా మార్చాలి. కులాలవారీగా కాకుండా, ఉత్పత్తి వర్గాల ఐక్యత అనే మోడల్‌పై ఒక సమగ్ర వేదిక అవసరం. విద్యావంతుల బీసీలు ప్రజలతో మమేకం కావాలి.
బీసీలు ఎవరికి ఓట్లు వేయాలో నిర్ణయించే స్థాయిలో కాకుండా, తమ పార్టీ, తమ అజెండాతో రావాలి. బీసీలు ఓటు బ్యాంక్ గా కాకుండా ‘బీసీ శక్తి’గా మారాలి. బీసీ ఉద్యమం దళిత ఉద్యమస్థాయిలో లేకపోవడం దురదృష్టం కాదు. అది ఒక హెచ్చరిక. సిద్ధాంతం లేకుండా, ఐక్యత లేకుండా, స్వతంత్ర దిశా నిర్దేశం లేకుండా ఏ ఉద్యమం కూడా శాశ్వతమవదు. బీసీ ఉద్యమం రక్తం పీల్చిన వ్యవస్థను ఎదుర్కోవాలంటే, బీసీలు ముందుగా తమ ఆలోచనా విధానం మార్చుకోవాలి. అది జరిగినరోజు దళిత ఉద్యమంలాగ బీసీ ఉద్యమం కూడా చరిత్రను మలుపు తిప్పుతుంది.
- పి. రేణుక భూంపల్లి
