యూఎస్​లో అనుమానాస్పద స్థితిలో ఇండియన్ దంపతులు మృతి

V6 Velugu Posted on Apr 10, 2021

ముంబై: యూఎస్​లో దారుణం జరిగింది. ఇండియాకు చెందిన సాఫ్ట్​వేర్ ఇంజనీర్ బాలాజీ రుద్రావర్‌‌‌‌‌‌‌‌ (32), అతని భార్య ఆర్తి రుద్రావర్(30) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. నివాసం ఉంటున్న అపార్ట్​మెంట్​లోనే ఇద్దరి డెడ్​బాడీలు కనిపించాయి. న్యూజెర్సీలోని నార్త్ ఆర్లింగ్టన్ బరోలో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దంపతుల నాలుగేళ్ల కూతురు బాల్కనీలో ఏడుస్తూ కనిపించడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్ మెంట్​కు చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. రక్తపు మడుగులో ఇద్దరి డెడ్​బాడీలు కనిపించాయి. దీంతో మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించిన పోలీసులు.. ఇద్దరి ఒంటిమీద బలమైన కత్తిపోట్లున్నాయని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే, ఇద్దరి మధ్య గొడవ జరగడంతోనే బాలాజీ తన భార్యను కత్తితో పొడిచి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. టెకీ దంపతులు మహారాష్ట్ర బీడ్ జిల్లా అంబజోగైకి చెందినవారుగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. 
మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బాలాజీ రుద్రావర్​కు ఆర్తితో 2014లో పెళ్లి జరిగింది. ఆ మరుసటి ఏడాది ఉద్యోగరీత్యా యూఎస్ కు వెళ్లి నార్త్ ఆర్లింగ్టన్ లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉండగా, ప్రస్తుతం ఆర్తి ఏడు నెలల గర్భవతి అని బాలాజీ తండ్రి భారత్ రుద్రావర్ మీడియాకు తెలిపారు. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఈ దారుణం ఎలా జరిగిందో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు సంతోషంగా కలిసి ఉంటున్నారని, ఎవరితోనూ గొడవలు లేవని పేర్కొన్నారు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక డెడ్​బాడీలు ఇక్కడికి చేరుకోవడానికి 10 రోజులు పడుతుందని యూఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారని చెప్పారు. మనవరాలు ప్రస్తుతం బాలాజీ స్నేహితుడి ఫ్యామిలీ సంరక్షణలో ఉందని తెలిపారు.

Latest Videos

Subscribe Now

More News