డెమోక్రసీలో మనం ప్రపంచానికే ఆదర్శం

డెమోక్రసీలో మనం ప్రపంచానికే ఆదర్శం

న్యూఢిల్లీ: ‘‘2047 నాటికి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి వందేండ్లు అవుతుంది. మన ఫ్రీడం ఫైటర్లు కన్న కలలను అప్పటిలోగా సాకారం చేసుకునే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏండ్లు అమృతకాలమని, ఈ వ్యవధిలో దేశ అభివృద్ధి మరింత వేగవంతం కావాల్సి ఉందన్నారు. దేశ 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము ఆదివారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఫ్రీడంఫైటర్ల త్యాగాలను మరువలేమని, వారు చూపిన బాటలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.  

ఆడ, మగ.. అంతరాలు తగ్గుతున్నయ్  

దేశంలో ఆడవాళ్లు, మగవాళ్ల మధ్య అసమానతలు తగ్గిపోతున్నాయని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని రాష్ట్రపతి ముర్ము అన్నారు. దేశానికి ఆడబిడ్డలే ఆశాదీపాలుగా నిలుస్తున్నారని మెచ్చుకున్నారు. సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళా ప్రతినిధుల సంఖ్య 14 లక్షలకుపైనే ఉందని గుర్తుచేశారు. ఫైటర్ జెట్ పైలట్ ల దగ్గర నుంచి స్పేస్ సైంటిస్టుల దాకా.. ఇండియా ఆడబిడ్డలు విజయ బావుటాను ఎగురవేస్తున్నారని ప్రశంసించారు. సరైన అవకాశాలు అందిస్తే మహిళలు మరెన్నో గొప్ప విజయాలు సాధించగలరన్నారు. ప్రజాస్వామ్యంలో మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రపతి అన్నారు. ఇతర దేశాల్లో మహిళలు ఓటు హక్కు కోసం ఎంతో పోరాడాల్సి వచ్చిందని.. మనదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే మహిళలకు ఓటుహక్కు వచ్చిందన్నారు.  

అగ్రదేశాలకు దీటుగా ఎదిగినం 

‘‘కరోనాను కొన్ని అగ్ర దేశాల కన్నా ఇండియా సమర్థంగా ఎదుర్కొంది. దేశంలోనే వ్యాక్సిన్ల అభివృద్ధి జరిగింది. 200 కోట్ల డోసుల టీకాల పంపిణీ పూర్తయింది. కరోనాపై యుద్ధంలో దేశం సాధించిన విజయంలో డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, సైంటిస్టుల పాత్ర అత్యంత కీలకం. ఇతర దేశాలకూ కరోనా టీకాలను అందించే స్థాయికి ఇండియా ఎదిగింది’’ అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ‘‘డిజిటల్ ఇండియా సాకారమయ్యే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. స్టార్టప్ లకు ఇండియా నెలవుగా మారింది. స్టార్టప్ ల ప్రోత్సాహానికి అనుకూల వాతావరణం దేశంలో ఉంది’’ అని చెప్పారు.

జాతి ఐక్యతను చాటాలె  

‘‘నవంబర్ 15వ తేదీని ‘జన జాతీయ గౌరవ్ దివస్’గా పాటించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మంచిది. మన గిరిజన వీరులు స్థానిక ప్రాంతీయ చిహ్నాలు మాత్రమే కాదు.. వారు యావత్ జాతికే స్ఫూర్తి’’ అని రాష్ట్రపతి తెలిపారు. దేశ విభజన నాటి బాధితుల స్మారకార్థం ఆగస్ట్ 14న స్మృతి దినాన్ని పాటిస్తున్నామని, దీనిద్వారా దేశంలో సామరస్యం, ఐక్యతను చాటేందుకు కృషి చేయాలన్నారు.