
తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికి దాయాది పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ ఎక్కడికక్కడ ఎండకడుతూనే ఉంది. ఈ క్రమంలో పెహల్గామ్ దాడి తర్వాత పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఆందోళన చెందుతున్న పాక్ భారత దూకుడు చర్యల నుంచి రక్షణ కోసం అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తోంది. అయితే అక్కడా ఇండియాను ఎదుర్కోవటంలో విఫలమౌతోందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధం దిశగా కదులుతున్న వేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించింది. అయితే చివరికి అది ఎటువంది తీర్మానాలు లేదా ప్రకటనలు లేకుండా ముగియటం గమనార్హం. అక్కడ జరిగిన విషయాలను ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పీటీఐ వార్తా సంస్థతో పంచుకున్నారు. గతంలో మాదిరిగానే పాక్ చేసే బెదిరింపులు మళ్లీ తాజా సమావేశంలో విఫలమయ్యాయని ఆయన వెల్లడించారు. పెరుగుతున్న ఉద్రిక్తతల సమయంలో భద్రతా మండలి జోక్యాన్ని కోరుతూ పాక్ చేసిన ప్రయత్నాలను భారత దౌత్యంతో విజయవంతంగా అడ్డుకుందని అక్బరుద్దీన్ వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితిలో గ్రీస్ శాశ్వత ప్రతినిధి, ప్రస్తుత భద్రతా మండలి అధ్యక్షుడు ఎవాంజెలోస్ సెకెరిస్ ఈ సమావేశంలో నిర్దిష్ట ఫలితాలు సాధించలేకపోయినట్లు అంగీకరించారు. ఉద్రిక్కతలను తగ్గించటంలో భద్రతా మండలి ఎల్లప్పుడూ సహాయకారిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జరిగిన సమావేశాలు UNSC చాంబర్‌లో కాకుండా సంప్రదింపుల గదిలో రహస్యంగా జరగటం గమనార్హం.
పాక్ ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణ వాతావరణాన్ని తగ్గించాలని కోరినప్పటికీ.. పాక్ ఆరోపణల మధ్య సానుకూల ఫలితాలు రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పాక్ చేస్తున్న ఆరోపణలను భారత్ తన దౌత్యంతో విజయవంతంగా మరోసారి తిప్పకొట్టగలిగింది. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపిన పాక్ రాయబారి.. భారతదేశం తన సైనిక నిర్మాణాలు, రెచ్చగొట్టే చర్యలకు కారణమని ఆరోపించారు. అలాగే ఈ క్రమంలో పాక్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. పహల్గామ్ దాడి విషయంలో తమ పాత్ర లేదని అన్నారు. అయితే మెుత్తానికి అంతర్జాతీయ వేదికలను మరోసారి దుర్వినియోగం చేసేందుకు పాక్ చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది.