న్యూఢిల్లీ: ఇండియన్ హాకీ జట్టు తమ సాంప్రదాయ నీలి రంగు (బ్లూ) జెర్సీలోకి మారనుంది. కాషాయ రంగు జెర్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో హాకీ ఇండియా (హెచ్‌ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఆసియా క్రీడల్లో ఇండియా మెన్స్, విమెన్స్ జట్లు బ్లూ జెర్సీతోనే బరిలో దిగనున్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ కప్‌లో ఇండియా జట్లు కాషాయ రంగు జెర్సీలను ధరించాయి.
ఫెడరేషన్ అధ్యక్షుడైన దిలీప్ టిర్కేకు కూడా తెలియకుండా బ్లూ జెర్సీని వదిలేయడం అప్పట్లో అంతర్గత వివాదాలకు దారి తీసింది. అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) విజ్ఞప్తి మేరకు తాము ఆసియా క్రీడల కోసం బ్లూ జెర్సీని తొలి ప్రాధాన్యతగా ఎంచుకున్నామని టిర్కే వెల్లడించాడు. రెండో ప్రాధాన్యతగా కాషాయ రంగు జెర్సీ ఉంటుందన్నాడు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ అర్హత టోర్నీల్లోనూ ఇండియా బ్లూ జెర్సీలోనే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశాడు.
