అద్భుతం వెనుక ఆరుగురు హీరోలు

V6 Velugu Posted on Aug 06, 2021

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌ ఏళ్లకు ఏళ్లుగా పోరాడినా.. ఎంతో మంది లెజెండ్స్‌‌ వచ్చిపోయినా.. ఏనాడూ పూర్వవైభవం దిశగా అడుగులు వేయని ఇండియన్‌‌ హాకీ టీమ్‌‌.. టోక్యోలో మాత్రం అద్భుతం చేసింది. ఆ అద్భుతం వెనుకున్న ఆరుగురు హీరోలు ఎవరో చూద్దాం. 

మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌... ది లీడర్‌‌

జలంధర్‌‌లోని మిథాపూర్‌‌ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన 29 ఏళ్ల మన్‌‌ప్రీత్‌‌.. హాకీ జర్నీ అంతా ఈజీగా జరగలేదు. తన చిన్నతనంలో తండ్రి మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌తో బాధపడుతుంటే.. తల్లి మంజీత్‌‌ కౌర్‌‌ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని కష్టాలు పడిందో కళ్లారా చూశాడు. ఆ కష్టాల్లో నుంచే అతను ఆటలో తిరుగులేని నైపుణ్యం, మానసిక ధృడసంకల్పం, మెండైన అత్మవిశ్వాసాన్ని సంపాదించాడు. 2016 సుల్తాన్‌‌ అజ్లాన్‌‌ షా కప్‌‌లో ఆడుతున్నప్పుడు మన్‌‌ప్రీత్‌‌ తండ్రి మరణించాడు. ఆ సంఘటనతో మన్‌‌ప్రీత్‌‌.. ఓర్చుకోలేని కష్టాలు ఎన్ని ఎదురైనా.. మనో నిబ్బరంతో ఉండటం నేర్చుకున్నాడు.  ఈ లక్షణాలే.. అతన్ని టీమిండియాకు కెప్టెన్‌‌గా చేశాయి. 2011లో ఇండియా తరఫున ఇంటర్నేషనల్‌‌ డెబ్యూ చేసిన ఈ జలంధర్‌‌ కుర్రాడు.. 2012 లండన్‌‌ ఒలింపిక్స్‌‌ టీమ్‌‌లో సభ్యుడిగా తొలిసారి బిగ్‌‌ టోర్నీ ఆడాడు. 

హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌.. డ్రాగ్‌‌ ఫ్లిక్‌‌ కింగ్‌‌

అమృత్‌‌సర్‌‌ శివారులోని జండియాల గురు టౌన్‌‌షిప్‌‌లోని ఓ రైతు కుమారుడు హర్మన్‌‌ప్రీత్‌‌. 2015లో డెబ్యూ చేసి.. 2016 సుల్తాన్‌‌ కప్‌‌లో సిల్వర్‌‌ మెడల్‌‌ సాధించాడు. 2019 ఒలింపిక్ క్వాలిఫయర్స్‌‌లో భాగంగా జరిగిన వరల్డ్‌‌ సిరీస్‌‌ ఫైనల్స్‌‌లో హర్మన్‌‌ప్రీత్‌‌ కీలక పాత్ర పోషించాడు. చిన్నప్పుడు ట్రాక్టర్‌‌పై మక్కువ చూపిన అతను పదేళ్ల వయసులోనే డ్రైవింగ్‌‌ నేర్చుకున్నాడు. అయితే గేర్‌‌ స్టిక్‌‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అతను హాకీ స్టిక్‌‌ను మాత్రం అలవోకగా తిప్పడం నేర్చుకున్నాడు. 

రూపిందర్‌‌పాల్‌‌ సింగ్‌‌.. డ్రాగ్‌‌ ఫ్లిక్‌‌ జీనియస్‌‌

టీమ్‌‌మేట్స్‌‌ ‘బాబ్‌‌’ అని ముద్దుగా పిలుచుకునే రూపిందర్‌‌పాల్‌‌.. వరల్డ్‌‌ హాకీలో బెస్ట్‌‌ డ్రాగ్‌‌ ఫ్లిక్‌‌ ప్లేయర్‌‌. 2010లో డెబ్యూ చేసిన అతను.. అరంగేట్రంలోనే సుల్తాన్‌‌ అజ్లాన్‌‌ షాలో గోల్డ్‌‌ కొట్టాడు. 2014లో వైస్‌‌ కెప్టెన్‌‌గా ఎంపికైనా.. 2018లో టీమ్‌‌ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. కానీ అదే ఏడాది ఆసియాగేమ్స్‌‌ టీమ్‌‌లో చోటు సంపాదించి.. శ్రీలంకపై హ్యాట్రిక్‌‌ గోల్స్‌‌ చేసి రీఎంట్రీని ఘనంగా చాటాడు. పంజాబ్‌‌లోని ఫరీద్‌‌కోట్‌‌లోని ఓ సిఖ్‌‌ ఫ్యామిలీలో పుట్టిన రూపిందర్‌‌పాల్‌‌.. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో ఆజానుబాహుడిలా కనిపిస్తాడు. 11 ఏళ్ల వయసులో ఆటను మొదలుపెట్టాడు. 

సిమ్రన్‌‌జిత్‌‌ సింగ్‌‌.. సూపర్‌‌ స్ట్రయికర్‌‌

కొవిడ్‌‌ నేపథ్యంలో.. ఆల్టర్‌‌నేట్‌‌ప్లేయర్లకు ఐవోసీ అనుమతించడంతో.. టీమ్‌‌లోకి వచ్చిన సిమ్రన్‌‌జిత్‌‌.. బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌లో అదరగొట్టాడు. జలంధర్‌‌లోని సుర్జీత్‌‌ సింగ్‌‌ హాకీ అకాడమీ ప్రొడక్ట్‌‌. 2016 జూనియర్‌‌ వరల్డ్‌‌కప్‌‌ విన్నింగ్‌‌ టీమ్‌‌ మెంబర్‌‌ కూడా. సిమ్రన్‌‌జిత్‌‌ కజిన్‌‌ గుర్జాంత్‌‌ సింగ్‌‌ కూడా ఇండియా టీమ్‌‌ మెంబర్‌‌. యూపీలోని ఫిలిబిత్‌‌ నుంచి గుర్జాంత్‌‌ సింగ్‌‌ హాకీ కెరీర్‌‌ మొదలైంది. 

ఇక హార్దిక్‌‌ సింగ్‌‌ జిన్స్‌‌లోనే హాకీ ఉంది. అతని తండ్రి, మామ.. ఇండియా టీమ్‌‌కు ఆడారు. హార్దిక్‌‌ మామ గుర్మైల్‌‌ సింగ్‌‌ 1980 సమ్మర్‌‌ గేమ్స్‌‌లో గోల్డ్‌‌ గెలిచిన ఇండియా టీమ్‌‌ మెంబర్‌‌.  ఈ ఆరుగురు ప్లేయర్లతో పాటు కోచ్​ గ్రహం రీడ్​ కూడా తన మాస్టర్​మైండ్​తో టీమ్​ను తీర్చిదిద్దాడు. 

పీఆర్‌‌ శ్రీజేశ్‌‌.. ది గ్రేట్‌‌ వాల్‌‌ ఆఫ్‌‌ ఇండియా

ఎర్నాకులం జిల్లాలోని కిజాక్కాంబలంలోని రైతు కుటుంబంలో జన్మించిన శ్రీజేశ్‌‌.. వరల్డ్‌‌ బెస్ట్‌‌ గోల్‌‌ కీపర్లలో ఒకడు. టీమ్‌‌ లాస్ట్‌‌ లైన్‌‌ డిఫెన్స్‌‌లో అతను ఉంటే గోడ కట్టినట్లే. 2006 సౌత్‌‌ ఏషియన్‌‌ గేమ్స్‌‌లో డెబ్యూ చేసిన 35 ఏళ్ల శ్రీజేశ్‌‌.. 2011 నుంచి సీనియర్‌‌ టీమ్‌‌లో రెగ్యులర్‌‌ మెంబర్‌‌. 2016లో కెప్టెన్‌‌గా వ్యవహరించిన శ్రీజేశ్‌‌..2016, 2018లో  చాంపియన్స్‌‌ ట్రోఫీలో సిల్వర్‌‌ మెడల్స్‌‌ను అందించాడు. చిన్నతనంలో స్ప్రింట్‌‌, లాంగ్‌‌ జంప్‌‌, వాలీబాల్‌‌ ఆడిన శ్రీజేశ్‌‌.. 12 ఏళ్ల వయసులో హాకీపై మనసు పారేసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అతని తండ్రి రవీంద్రన్‌‌ ఇంట్లో ఉన్న ఆవును అమ్మి.. గోల్ కీపర్‌‌ కిట్‌‌ కొనిచ్చాడు.  
 

Tagged tokyo, MEDAL, Effort, indian hockey team, six behind, winnin, significant, manpreethsingh

Latest Videos

Subscribe Now

More News