జాక్ పాట్: దుబాయ్ లో ఇండియన్ డ్రైవర్ రూ.40 కోట్ల లాటరీ

జాక్ పాట్: దుబాయ్ లో ఇండియన్ డ్రైవర్  రూ.40 కోట్ల లాటరీ

అబుధాబి: అదృష్టం తలుపు తడుతుందన్న ఆశతో అతడి ఎదురుచూపులు మూడేండ్లకు ఫలించాయి. వదిలి పెట్టకుండా ప్రతి ఏటా లాటరీ టికెట్లు కొంటున్న అతడికి ఏకంగా రూ.40 కోట్ల జాక్ పాట్ తగిలింది. దుబాయ్ లో డ్రైవర్ గా పని చేస్తున్న కేరళ వ్యక్తితో పాటు అతడి ఫ్రెండ్స్ కు ఈ బంపర్ లాటరీ వచ్చిందని ఖలీజ్ టైమ్స్ మీడియా ప్రచురించింది. యూఏఈలోని అబుధాబిలో కేరళకు చెందిన 37 ఏండ్ల రంజిత్ సోమరాజన్ టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గడిచిన మూడేళ్లుగా ప్రతి సంవత్సరం అతడు జాక్ పాట్ లాటరీ టికెట్లు కొంటూ వస్తున్నాడు. ఈ లాటరీ ఫస్ట్ ప్రైజ్ 2 కోట్ల దిర్హామ్స్ (ఇండియన్ కరెన్సీలో సుమారు 40 కోట్ల రూపాయలపైనే), సెకండ్ ప్రైజ్ 30 లక్షల దిర్హామ్స్ (రూ.6 కోట్లు), మూడో ప్రైజ్ 10 లక్షల దిర్హామ్స్ (రూ.2 కోట్లు) ఉంటుంది. అయితే తనకు జాక్ పాట్ ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని సోమరాజన్ చెబుతున్నాడు. ఏ సెకండ్ ప్రైజో, థర్డ్ ప్రైజో వచ్చినా గ్రేట్ అనుకున్నానని అన్నాడు. ‘‘నేను దుబాయ్ లో టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాను. గతేడాది కరోనా కారణంగా చాలా ఇబ్బంది పడ్డాను. శాలరీ కట్ చేయడంతో ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా మారింది. అయినా ఏటా మాదిరే లాటరీ టికెట్ కొనాలనుకున్నా. నాతో పాటు ఇంకో పది మంది ఫ్రెండ్స్ కలిసి తలా 100 దిర్హామ్స్ (రూ.2 వేలు) వేసుకుని నా పేరుపై టికెట్ కొన్నాం. ఇప్పుడు జాక్ పాట్ డబ్బు అందరం కలిసి పంచుకుంటాం. వాళ్లంతా ఇండియాతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి వచ్చి ఇక్కడ నాలాగే పనులు చేసుకుంటున్నారు’’ అని సోమరాజన్ చెప్పాడు. ప్రతి ఏటా లాటరీ టికెట్ కొంటుంటే కొంత మంది ఎగతాళి చేసేవాళ్లని, అయితే ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు అదృష్టం మనల్ని వరిస్తుందని చెప్పేవాడినని అంటున్నాడు.