
- ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకువచ్చిన కేంద్రం
- బ్రెయిన్ స్ట్రోక్‌తో 10 రోజులుగా కజకిస్తాన్‌లోవెంటిలేటర్‌పై ఉన్న రాహుల్
జైపూర్: బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ కజకిస్తాన్‌లో ప్రాణాలతో పోరాడుతున్న మన దేశానికి చెందిన 22 ఏండ్ల ఎంబీబీఎస్ స్టూడెంట్‌ను ప్రత్యేక విమానంలో రాజస్తాన్‌కు తరలించారు. సోమవారం సాయంత్రంకల్లా విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. జైపూర్‌లోని షాపురాకు చెందిన రాహుల్ ఘోసల్య కజకిస్తాన్‌లోని ఆస్తానాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 8న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడే ఆస్పత్రిలో చేర్పించారు.
అప్పటి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్న రాహుల్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో సోమవారం జైపూర్‌కు తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రి సీనియర్ డాక్టర్ నేతృత్వంలో నలుగురు డాక్టర్ల టీమ్‌ను అపాయింట్ చేసి, ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేసింది.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత రాహుల్‌ను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పలుమార్లు కోరారు. రాహుల్‌ను కాపాడాలంటూ సోషల్ మీడియాలోనూ వేలాదిమంది రిక్వెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసింది.