బ్రిటన్ పర్యాటకులకు వీసా ట్రబుల్

బ్రిటన్ పర్యాటకులకు వీసా ట్రబుల్
  • ఇండియా టూర్ రద్దు చేసుకున్న వేలాది మంది
  • వీసా నిబంధనల్లో మార్పులతో సమస్య

లండన్: వీసా నిబంధనల్లో ఉన్నట్టుండి మార్పులు చేయడంతో వేలాది మంది బ్రిటన్ టూరిస్టులు పౌరులు.. ఇండియా పర్యటనను రద్దు చేసుకున్నారు. టూరిస్ట్ వీసాలకు దరఖాస్తు చేసుకునేందుకు బ్రిటన్‌‌లోని వీసా సెంటర్లలో వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పడం, విమానాలు బయల్దేరడానికి ముందు దాకా కూడా అపాయింట్‌‌మెంట్స్ అందుబాటులో లేకపోవడంతో తమ టూర్‌‌‌‌లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇండియాకు రావాలని అనుకునే వేలాది మంది బ్రిటన్ టూరిస్టులు.. వీసా ఏజెంట్లపై ఆధారపడుతుంటారు. కానీ గత సోమవారం సాయంత్రం ఒక నోటిఫికేషన్ వెలువడింది. ఏజెంట్లకు అనుమతి ఇవ్వబోమని, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లు వీఎఫ్ఎస్ గ్లోబల్ సెంటర్లకు వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొన్నారు. 

ఉపాధిపై ప్రభావం
‘‘వచ్చే 2 నెలలపాటు ఎలాంటి అపాయింట్‌‌మెంట్స్‌‌ లేవు. అప్లై చేసుకున్న వాళ్లు సెంటర్లకు వెళ్లినా.. వారికి వీసా అందదు. ఆన్‌‌లైన్‌‌లో అపాయింట్‌‌మెంట్ బుక్ చేసుకోవాల్సిందే. దీంతో చాలామంది కస్టమర్లు టూర్లను రద్దు చేసుకున్నారు” అని లండన్‌‌లోని ఇండస్ ఎక్స్‌‌పీరియన్సెస్ ఎండీ యాసిన్ జార్గర్ చెప్పారు.

అనుమతిలేని ఏజెంట్లు, అక్రమ ఫీజులు
నిబంధనల నేపథ్యంలో లండన్‌‌లోని ఇండియన్ హై కమిషన్ ఓ స్టేట్‌‌మెంట్ జారీ చేసింది. ‘‘అనుమతిలేని ఏజెంట్లు, వ్యక్తులు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే నిబంధనలు మార్చాం” అని తెలిపింది.

నవంబర్ 22 దాకా అపాయింట్‌‌మెంట్లు లేవు
వీసాలు రాకపోవడంతో 900 పాస్‌‌పోర్టులు వెనక్కి ఇచ్చేశానని ట్రావ్‌‌కోర్ వీసా ఏజెన్సీ సంస్థ చీఫ్ డారెన్ బ్రిడ్జెస్ చెప్పారు. ‘‘నవంబర్ 22న మాత్రమే తొలి అపాయింట్‌‌మెంట్ ఉంది. ఒకవేళ అదే రోజు అపాయింట్‌‌మెంట్ దొరికితే వీసా ప్రాసెస్ చేయడానికి 10 రోజులు పట్టవచ్చు. కాబట్టి ఎవరైనా ఈ తేదీ కంటే ముందు  ప్రయాణం  చేయడం కుదరదు’’ అని చెప్పారు.