దేశంలో వైద్య ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సగటు మానవుడు తన సంపాదనలో దాదాపు 40 శాతం డబ్బును వైద్యానికే ఖర్చు చేస్తుండటం గమనార్హం. భారత్ హెల్త్ ఇండెన్స్ 2023 సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
భారత్ హెల్త్ ఇండెన్స్ 2023 దేశ జనాభా, వారి ఆరోగ్యంపై ఓ సర్వే నిర్వహించింది. 10 వేలకు పైగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వే ప్రకారం..దేశ జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో 25శాతం మంది వారి పరిసర ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే చికిత్స కోసం వెళ్తున్నారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లోని మిగిలిన 10 శాతం మంది తమకు 10 కిలో మీటర్ల పరిధిలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. మరో 15 శాతం మంది ప్రజలు తమ దగ్గర్లోకి ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అయితే సర్వే నివేదిక ప్రకారం.. 25 శాతం మంది సాధారణ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటు ఉన్నారు. అయతే నిపుణులైన కార్డియాలజిస్టులు, గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల వారు మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారు.
వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయంటే..
భారత్ హెల్త్ ఇండెక్స్ 2023 ప్రకారం దేశ జనాభాలో సగటు కుటుంబం వార్షిక ఆదాయం దాదాపు 15 నుంచి 25 శాతం వైద్య ఖర్చులకే సరిపోతుంది. మరో 23 శాతం మంది ఆసుపత్రుల ఖర్చుల కోసం లోన్లు తీసుకుంటున్నారట. 6శాతం మంది ప్రజలు వైద్య బిల్లుల కోసం ఆస్తులను విక్రయిస్తున్నారట. అయితే 53 శాతం మంది ప్రజలు మాత్రం వైద్య ఖర్చుల కోసం కొన్ని రకాల పొదుపు నియమాలు పాటిస్తున్నారని భారత్ హెల్త్ ఇండెక్స్ పేర్కొంది.
చికిత్స కోసం వందల కిలో మీటర్ల ప్రయాణం..
దేశ జనాభాలో 90 శాతం మంది ప్రజలు క్యాన్సర్, న్యూరోలాజికల్ లేదా బ్లడ్ డిజార్డర్స్ వంటి ప్రత్యేక చికిత్స కోసం తమ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించాల్సి వస్తోందని సర్వే పేర్కొంది. అయితే రోగులకు తమ ప్రాంతాల్లో మెరుగైన చికిత్స కేంద్రాలు, ఆధునీక వైద్య సదుపాయాలు లేకపోవడంతో 5 శాతం మంది ప్రజలు తమ కుటుంబాల్లోని వ్యక్తులను కోల్పోతున్నారని సర్వే వెల్లడించింది.
అందుబాటులో మందులు ఉన్నాయా..?
దేశ ప్రజల్లో 52 శాతం మంది ప్రజలు తమ నివాసం నుంచి 5 కిలో మీటర్ల పరిధిలో ఫార్మసీ సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. అయితే 85 శాతం మంది ప్రజుల కొన్ని ప్రత్యేక టాబ్లెట్ల కోసం 10 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంది. ఇక 47 శాతం మంది ప్రజలు తమ ఇంట్లోనే థర్మామీటర్ ను కలిగి ఉన్నారు. అయితే 7 శాతం మంది మాత్రమే రక్తపోటు, బ్లడ్ షుగర్ ను చెక్ చేసే పరికరాలను కలిగి ఉన్నారు.
ఎంత మందికి హెల్త్ ఇన్యూరెన్స్ ఉంది..?
దేశ ప్రజల్లో 28 శాతం మంది మాత్రమే వైద్య బీమాను కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. ఇందులో 88 శాతం మంది ప్రభుత్వం లేదా వివిధ పథకాల ద్వారా ఈ బీమా సౌకర్యాన్ని కలిగి ఉన్నారు. 10 శాతం మంది ప్రైవేటు బీమా సదుపాయాన్ని కలిగి ఉన్నారు. అయితే 55 శాతం మంది ఇప్పటి వరకు వైద్య బీమా గురించి వినలేదట. 36 శాతం మందికి బీమా ప్రయోజనాలు ఏంటో తెలియవట. మరో 24 శాతం మంది ప్రజలకు అసలు వైద్య బీమాను ఎలా పొందాలో కూడా తెలియదట. ప్రీమియం ఛార్జీలు అధికంగా ఉండటంతో 28 శాతం మంది తీసుకోలేదట. మరోవైపు కొన్ని సంక్లిష్టమైన పేపర్ సమస్యలతో 15 శాతం మంది వైద్య బీమాకు దూరంగా ఉన్నారట. కొన్ని రకాల రోగాలకు బీమా సౌకర్యం లేక 18 శాతం మంది ఈ బీమాను తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. మరో 7 శాతం మంది ప్రజలు భాష లేదా, నిరక్షరాస్యత వల్ల తీసుకోలేదట.