
Trump Letter to Drug Majors: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో బాంబ్ పేలుస్తున్నారు. నిన్న ఇండియాపై 25 శాతం సుంకాలను ప్రకటించిన ట్రంప్.. ఇవాళ రాగిపై 50 శాతం టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచంలోని 17 పెద్ద ఫార్మా దిగ్గజ సంస్థలకు అమెరికాలో అమ్ముతున్న మందుల ధరలను వెంటనే తగ్గించాలంటూ ట్రంప్ రాసిన లేఖ సంచలనంగా మారింది.
వెంటనే అమెరికాలో అమ్ముతున్న మందుల ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలకు సూచించారు ట్రంప్. ఇందుకోసం సెప్టెంబర్ 29, 2025 డెడ్ లైన్ అని తేల్చి చెప్పారు. ట్రంప్ లెటర్స్ పంపిన ఫార్మా కంపెనీల్లో ఎలి లిల్లీ అండ్ కంపెనీ, సనోఫీ, రెజెనెరాన్ ఫార్మా, మెరెక్, GSK, జాన్సన్ & జాన్సన్, జెనెంటెక్, ఆమ్జెన్, ఆస్ట్రాజెనెకా, నోవో నార్డిస్క్, ఫైజర్, EMD సెరోనో, గిలియడ్ సైన్సెస్, నోవార్టిస్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, బోహ్రింగర్ ఇంగెల్హీమ్, అబ్వీ ఉన్నాయి. ధరలను తగ్గించటానికి కంపెనీలు ముందుకు రాకపోతే తాము అన్ని ఆయుధాలను వినియోగిస్తామన్నారు ట్రంప్.
అధిక మందుల ధరలతో అమెరికన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తాను చెక్ పెట్టాలనుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా అభివృద్ధి చేసిన మందులతో ప్రపంచ దేశాలు లాభపడటాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే అమెరికాలో అమ్ముతున్న మందుల రేట్లు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. కష్టపడుతున్న అమెరికన్లపై మందుల భారం మోపటాన్ని ట్రంప్ తప్పుపడుతున్నారు. కంపెనీలు కొన్ని మందులను థర్డ్-పార్టీ బీమా సంస్థలకు అందించే ధరలకు నేరుగా రోగులకు అందించాల్సి ఉంటుందని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు.
ఫార్మా రంగంపై ప్రస్తుతం ట్రంప్ విరుచుకుపడటంతో భారతీయ సంస్థలు కూడా ఆందోళనకు గురవుతున్నాయి. వాస్తవానికి ఇండియాలోని పెద్ద ఫార్మా సంస్థల ఆదాయంలో దాదాపు 20-30 శాతం వరకు అమెరికా మార్కెట్ల నుంచే వస్తుంటుంది. దీంతో నేడు సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, సిప్లా, గ్రాన్యూల్స్ ఇండియా, లుపిన్ స్టాక్స్ నష్టాలను చూస్తున్నాయి. ఈ క్రమంలో సన్ ఫార్మా స్టాక్ భారీగా పతనం కావటంతో బ్రోకరేజీలు కూడా సెల్ రేటింగ్ అందిస్తున్నాయి.