హైదరాబాద్ సిటీ, వెలుగు : అన్ని రకాల రైల్వే సేవలకు ‘రైల్ మదద్ హెల్ప్ లైన్ నంబర్ 139’ ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. రైల్వేతో సంప్రదింపులను సులభతరం చేయడానికి, అన్ని రకాల హెల్ప్ లైన్ నంబర్లను ఏకీకృతం చేస్తూ వన్ స్టాప్ కాంటాక్ట్ గా “139” హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే ఏప్రిల్ 1, 2021 నుంచి రైల్వేకి సంబంధించి అన్ని రకాల సహాయానికి హెల్ప్ లైన్ 139లో ఏకీకృతం చేసిందని అధికారులు తెలిపారు.
ఈ సింగిల్ నంబర్ హెల్ప్ లైన్ రైలు ప్రయాణికులకు వివిధ రకాల ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే, ఈ నంబర్ పన్నెండు భాషల్లో అందుబాటులో ఉందని తెలిపారు. ప్రయాణికులు ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్)ని ఎంచుకోవచ్చని లేదా 139కి డయల్ చేయడం ద్వారా కాల్-సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో నేరుగా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.