అసన్ (కొరియా): కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీకి ఇండియా షట్లర్లు రెడీ అయ్యారు. మంగళవారం నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో.. ఇండియా ఆశలన్నీ తన్వీ శర్మపైనే ఉన్నాయి. తన్వీ ఇటీవల ముగిసిన తైపీ ఓపెన్ ఫైనల్లో వియత్నాం ఆటగాడిని ఓడించి తొలి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ సాధించింది. దాంతో సైనా నెహ్వాల్ (2008) తర్వాత తైపీ ఓపెన్ గెలిచిన రెండో ఇండియా విమెన్స్ సింగిల్స్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది.
ఈ క్రమంలో సైనా, పీవీ సింధు, దేవిక సిహాగ్‌ల ఎలైట్ క్లబ్‌లో చేరింది. తొలి రౌండ్‌లో తన్వీ.. క్వాలిఫయర్‌తో తలపడనుంది. మెన్స్ సింగిల్స్‌లో మూడోసీడ్ కిడాంబి శ్రీకాంత్ కూడా టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ వరకు వెళ్లిన శ్రీకాంత్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కెనడా ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఇజ్రాయెల్ ఆటగాడు డానియిల్ దుబోవెంకోతో తొలి రౌండ్ పోరును మొదలుపెట్టనున్నాడు.
మెన్స్ సింగిల్స్‌లో ఆరుగురు, విమెన్స్‌లో 10 మంది మెయిన్ డ్రాలో చోటు దక్కించుకున్నారు. కిరణ్ జార్జ్, సనీత్ దయానంద్, రౌనక్ చౌహాన్, తరుణ్ మన్నెపల్లి, మిథున్ మంజునాథ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విమెన్స్ సింగిల్స్‌లో ఏడో సీడ్ మాళవిక బన్సోద్ క్వాలిఫైయర్‌తో ఆడనుండగా, తాన్యా హేమంత్ తొలి రౌండ్‌లో అగ్రశ్రేణి ఆటగాడితో తలపడాల్సి ఉంది. ఆకర్షి కశ్యప్, శ్రీయాంశి వాలిశెట్టి, రక్షిత శ్రీ, అస్మిత చాలిహా, ఎనిమిదో సీడ్ అన్మోల్ ఖర్బ్, మానసి సింగ్, ఐదో సీడ్ ఇషారాణి బరువా బరిలో ఉన్నారు.
