లడఖ్లో క్రికెట్ ఆడిన సైనికులు

లడఖ్లో క్రికెట్ ఆడిన సైనికులు

చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ సమీపంలో తూర్పు లడఖ్‌లో భారత సైనికులు క్రికెట్ ఆడారు.  2020 నుండి భారత్ - చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు  ఏర్పడిన గాల్వాన్ వ్యాలీలోనే జవాన్లు క్రికెట్ మ్యాచ్లో పాల్గొన్నారు. పాటియాలా బ్రిగేడ్ త్రిశూల్ డివిజన్‌కు చెందిన సైనికుల బృందం ఈ క్రికెట్ మ్యాచులో పాల్గొంది. భారత సైనికులు ఉత్సాహంగా క్రికెట్  ఆడుతున్న ఫోటోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో సైనికులు క్రికెట్ ఆడటం అందరిని ఆకట్టుకుంటోంది. జీ20 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్‌తో సమావేశమైన సమయంలోనే ఈ మ్యాచ్ ఆడటం విశేషం. 

గాల్వాన్ లో భారత్ చైనా మధ్య ఘర్షణ

జూన్ 15, 2020న, లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.  వాస్తవ నియంత్రణ రేఖ వద్ద రెండు దేశాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో 2020  జూన్‌లో  చైనా దళాలు వాస్తవ నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి వచ్చాయి.  చైనా శిబిరాన్ని చూసిన భారత సైనికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కొద్దిసేపటికే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జూన్ 15 రాత్రి పెద్ద సంఖ్యలో చైనా సైనికులు.. భారత సైనికులపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రెండు వైపుల నుండి ఎటువంటి కాల్పులు జరగనప్పటికీ..,కర్రలు, రాడ్లతో దాడులు జరిగాయి. ఈ ఘర్షణలో  20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.  అటు చైనా సైనికులు కూడా అనేక మంది మరణించారు. ఘర్షణ తర్వాత పరిస్థితిని సద్దుమణిగించేందుకు భారత్, చైనా అగ్ర కమాండర్లు చర్చలు జరిపారు. వివాదాన్ని పరిష్కరించడానికి రెండు దేశాల మధ్య వివిధ ఫ్లాగ్ సమావేశాలు కూడా జరిగాయి.