భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల నష్టాలకు కారణాలు ఇవే

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్ల నష్టాలకు కారణాలు ఇవే

ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం మెుదలవ్వటంతో స్టాక్ మార్కెట్లలో అలజడి మెుదలైంది. దీంతో కొత్త వారం మెుదటి రోజునే దేశీయ మార్కెట్లు ఊహించన నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చింది. మార్కెట్ల క్లోజింగ్ నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 719 పాయింట్ల నష్టపోగా.. నిఫ్టీ 243 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 432 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 849 పాయింట్ల మేర నష్టపోయింది. 

ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనల నడుమ మార్కెట్ క్రాష్ అవ్వడానికి 6 ముఖ్యమైన కారణాలు ఇవే.. 

1. భగ్గుమంటున్న క్రూడ్ ధరలు:
లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒక్కసారిగా 4.5 శాతం పెరిగి బ్యారెల్‌కు ఏకంగా 97.16 డాలర్లకు చేరుకుంది. ఇది క్రూడ్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందనే ఆందోళనలను పెంచింది.

2. ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు:
ఇరాన్ చేసిన తాజా క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతీకార చర్యలకు దిగొద్దని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇరుపక్షాలు తిరిగి చర్చల వైపు రావాలని, లేదంటే గత 3 నెలలుగా సాగుతున్న శాంతి చర్చలు పూర్తిగా దెబ్బతింటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలు క్రూడ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

3. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు:
గ్లోబల్ మార్కెట్లలో ముఖ్యంగా ఏఐ ఆధారిత ర్యాలీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇవాళ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. ఆసియా మార్కెట్లయిన సౌత్ కొరియాకు చెందిన కోస్పి ఏకంగా 8 శాతం పడిపోవడంతో అక్కడ ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్ కూడా భారీగా నష్టపోయాయి. అంతకుముందు శుక్రవారం యూఎస్ మార్కెట్లలో నాస్‌డాక్ 4.18 శాతం నష్టంతో ముగిసింది.

►ALSO READ | నెలకు రూ.40వేలు సంపాదనతో కోటి కూడబెట్టాలని ఉందా..? ఇదిగో పక్కా సేవింగ్స్ ప్లాన్

4. కొనసాగుతున్న FII అమ్మకాల జోరు:
భారత మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. జూన్ మొదటి వారంలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దాదాపు రూ.43వేల కోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ పెట్టుబడులన్నీ విదేశాల్లోని ఏఐ రంగం వైపు తరలుతున్నాయి. గడిచిన ఏడాది మొత్తం మీద రూ.లక్షా 66వేల కోట్లు ఉపసంహరించుకోగా.. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు ఏకంగా రూ.2లక్షల 67వేల కోట్ల పెట్టుబడులు దేశం దాటి వెళ్లిపోవటం గమనార్హం.

5. రికార్డు స్థాయికి పడిన రూపాయి:
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 17 పైసలు క్షీణించి 95.35 వద్ద ట్రేడ్ అవుతోంది. బలమైన యూఎస్ ఆర్థిక గణాంకాలు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, యుద్ధ భయాల కారణంగా డాలర్ మరింత బలంగా మారడంతో రూపాయి పతనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

6. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు భయాలు:
అమెరికాలో మే నెల జాబ్ రిపోర్ట్ అంచనాల కంటే బలంగా రావడంతో రానున్న జూన్ 16-17 ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలు బలపడ్డాయి. జూన్ 10న రాబోయే మే నెల ద్రవ్యోల్బణ ఒకవేళ ఎక్కువగా నమోదైతే.. యూఎస్ ఫెడ్ ఖచ్చితంగా వడ్డీ రేట్లను పెంచుతుందనే భయం ఇన్వెస్టర్లను వెనకడుగు వేసేలా చేసింది.