మారిన కాలంలో నిత్యావసర వస్తువుల ధరల నుంచి పిల్లల స్కూల్ ఫీజుల వరకు అన్నీ కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల లోపు జీతం సంపాదించేవారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డబ్బు సేవ్ చేయడం చాలా కష్టంగా మారుతోంది. అయితే చేతిలో తక్కువ జీతం ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కోసం కోటి రూపాయలు కూడబెట్టాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నెలకు రూ.40వేలు జీతం వచ్చే సగటు ఉద్యోగి కూడా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే రూ.కోటి టార్గెట్‌ను ఎలా చేరుకోవచ్చో ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. దీనికి ‘స్టెప్-అప్ ఎస్‌ఐపీ’ అనే అద్భుతమైన ఫైనాన్షియల్ అస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.
సాధారణంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) అంటే ప్రతి నెలా ఒక స్థిరమైన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం. కానీ ‘స్టెప్-అప్ ఎస్‌ఐపీ’ అనేది దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటది. ఇందులో ప్రతి సంవత్సరం మీ పెట్టుబడి మొత్తాన్ని కొంత శాతం మేర పెంచుకుంటూ వెళ్తాలి. ఉద్యోగులకు ఏటా వచ్చే అదనపు ఆదాయాన్ని ఈ స్టెప్-అప్ పెట్టుబడికి ఉపయోగించవచ్చు. ఇలా క్రమంగా పెట్టుబడిని పెంచడం వల్ల 'పవర్ ఆఫ్ కాంపౌండింగ్' మరింత వేగంగా పనిచేసి.. తక్కువ కాలంలోనే ఊహించని స్థాయిలో భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ప్రారంభంలోనే ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాలనే ఒత్తిడి లేకుండా.. పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది చక్కటి మార్గం.
రూ.కోటి కార్పస్‌ను సాధించడానికి నిపుణులు ఒక క్యాలిక్యులేషన్ సూచిస్తున్నారు. నెలకు రూ.40వేలు సంపాదించే వ్యక్తి ప్రతి నెలా రూ.8వేలతో సిప్ ప్రారంభించాడనుకుందాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆ పెట్టుబడిని జస్ట్ 10 శాతం మేర పెంచుకుంటూ వెళ్లాలి. అంటే మొదటి ఏడాది నెలకు రూ.8,000 చొప్పున కడితే, రెండో ఏడాది నెలకు రూ.8,800 చొప్పున కట్టాలనమాట. ఈ విధంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏటా సగటున 12 శాతం వార్షిక రిటర్న్స్ వస్తాయని అంచనా వేసినా.. సదరు ఇన్వెస్టర్ కేవలం 18 ఏళ్లలోనే సుమారు రూ.కోటిని సులువుగా కూడబెట్టవచ్చు. మీ వయస్సు, ఆర్థిక లక్ష్యాలను బట్టి ఈ ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితిని 15, 20, 25 లేదా 30 ఏళ్ల వరకు కూడా పొడిగించుకోవచ్చు.
ALSO READ : వామ్మో 1 BHK అద్దె రూ.40వేలా..
మన దేశంలో సాంప్రదాయ పెట్టుబడి మార్గాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడే రిటర్న్స్‌ను ఇవి అందించలేవు. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఏటా వచ్చే రిటర్న్స్ ఒకేలా ఉండకపోవచ్చు. కొన్ని సంవత్సరాలు తక్కువగా, మరికొన్ని సంవత్సరాలు చాలా ఎక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ గత చరిత్రను పరిశీలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున 10% నుండి 13% వరకు లాభాలను అందించాయి. అందుకే తక్కువ జీతంతోనే రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు కావాలనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో స్టెప్-అప్ సిప్ ప్లాన్ మంచి ఆప్షన్ అంటున్నారు ఆర్థిక నిపుణులు.
