ఐటీ హబ్ బెంగళూరులో ఇళ్ల అద్దెలు సామాన్యులకే కాదు.. లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ ఇక్కడ అద్దెలు విపరీతంగా పెరిగిపోతుండటంతో టెక్కీలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా బెంగళూరులో నివసిస్తున్న ఒక గూగుల్ టెక్కీకి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జర్నీ కష్టాలు తప్పించుకోవడానికి ఆఫీసు దగ్గరగా ఇల్లు మారదామని అనుకున్న ఆ యువతికి.. 1 BHK ఫ్లాట్ అద్దెలు చూసి గుండె గుభేలుమంది. నెలకు రూ.40 వేల దాకా రెంట్ చెప్పడంతో, బాబోయ్ అంత అద్దె కట్టడం కంటే రోజుకు 2 గంటలు ట్రాఫిక్‌లో నరకం చూడటమే బెటర్ అంటూ ఆమె తన ప్లాన్ మార్చుకుంది.
బెంగళూరులోని గూగుల్‌లో పనిచేస్తున్న దివ్యా పోర్వాల్ అనే టెక్ ప్రొఫెషనల్ ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' లో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె తన ఆఫీస్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. అయితే బెంగళూరులోని ట్రాఫిక్ జామ్‌ల వల్ల ప్రతిరోజూ గంటల తరబడి రోడ్లపైనే సమయం వృథా అవుతుండటంతో.. ఎలాగైనా ఆఫీస్‌కు దగ్గరగా ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి మారాలని అనుకుంది. గేటెడ్ కమ్యూనిటీ అయితే భద్రతతో పాటు అన్ని రకాల వసతులు ఉంటాయని భావించి, గత వారాంతంలో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఒక చిన్న 1 BHK ఫ్లాట్ కోసం వెతకడం స్టార్ట్ చేసింది.
I live just 10 km away from my office, so this weekend I thought of finding a flat nearby. I was hoping for a 1 BHK in a gated society since it's safer and has all the amenities.
— Divya Porwal (@divyaporwal_) June 7, 2026
Then I saw the rents.
₹30k–40k for a 1 BHK. 🤯
I literally dropped the plan of shifting. I'll…
అయితే అక్కడ ఫ్లాట్ల అద్దె ధరలు చూశాక ఆమెకు మైండ్ బ్లాంక్ అయింది. గేటెడ్ సొసైటీల్లో ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు పలుకుతోంది. దీంతో ఇల్లు మారాలనే ఆలోచనను ఆమె పూర్తిగా క్యాన్సిల్ చేసుకుందట. ఈ విషయాన్ని ఎక్స్‌లో రాస్తూ.. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్‌కు దగ్గరగా మారదామని 1 BHK కోసం చూశాను. కానీ ఆ అద్దెలు చూశాక షిఫ్ట్ అయ్యే ప్లాన్ డ్రాప్ చేసుకున్నానని పేర్కొంది. దీనికంటే రోజుకు 2 గంటలు ట్రాఫిక్‌లోనే గడపడం మేలని, అయినా ఎలాగో ప్రభుత్వానికి లక్షల్లో పన్నులు కడుతున్నాను కదా.. ఇకపై కొంత సమయం రోడ్డు మీదే గడుపుతా అంటూ తన అసహనాన్ని, వ్యంగాన్ని జోడిస్తూ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లో పెరుగుతున్న అద్దెలపై పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. గత నెలలో తాను ఆఫీస్ దగ్గర 2 BHK ఫ్లాట్ చూశానని.. దానికి నెలకు రూ. 52 వేల అద్దెతో పాటు మెయింటెనెన్స్ అడిగారని చెప్పుకొచ్చారు. దీంతో తాము పాత ఇంట్లోనే ఉండిపోయామని రాశారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. అద్దెల విషయంలో బెంగళూరు, ముంబై నగరాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని విమర్శించారు. జీతం ఒక రూ.20-30 వేలు తక్కువైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే అన్నింటికంటే బెస్ట్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గూగుల్ టెక్కీ పోస్ట్ మరోసారి బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అద్దె కష్టాలను కళ్లకు కట్టింది.
