సెన్సెక్స్ 1,100 పాయింట్లు జంప్
ఎల్టీసీజీ, ఎస్టీటీ తగ్గించడంపై ప్రభుత్వం చర్చిస్తోందని ప్రకటించిన ఆర్థిక మంత్రి
8 శాతం పెరిగిన హెచ్‌సీఎల్ టెక్ షేర్లు
ముంబై: గత కొన్ని వారాలుగా వరుస నష్టాలతో డీలాపడిన స్టాక్ మార్కెట్లు మంగళవారం అనూహ్యంగా పుంజుకున్నాయి. షేర్లను అమ్మినప్పుడు వేసే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) పన్ను , ట్రేడింగ్ లావాదేవీలపై పడే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ల తగ్గింపు లేదా సవరణపై ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. దీనికితోడు ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లు ఎగిసింది.
ఐటీ, ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు మెరిశాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,109.10 పాయింట్లు (1.54శాతం) ఎగిసి 73,033.78 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 358.60 పాయింట్లు (1.60శాతం) పెరిగి 22,721.95 వద్ద ముగిశాయి. గత నాలుగు నెలల్లో సెన్సెక్స్‌కు ఇదే అత్యుత్తమ సింగిల్-డే లాభం. క్యూ2 ఫలితాలు మెప్పించడంతో హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు ఏకంగా 8.28శాతం దూసుకెళ్లగా, టీసీఎస్ 6.59శాతం, టెక్ మహీంద్రా 4.90శాతం, ఇన్ఫోసిస్ 4.44శాతం లాభపడ్డాయి. హెచ్‌యూఎల్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణించగా, కోటక్ బ్యాంక్, మారుతి స్వల్పంగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 104.6 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డాలరుతో రూపాయి విలువ 41 పైసలు బలపడి 95.37 వద్ద స్థిరపడింది.
మార్కెట్లు పెరగడానికి గల కారణాలు ఎల్టీసీజీ, ఎస్టీటీ తగ్గే ఛాన్స్
స్టాక్ మార్కెట్లో షేర్లు కొని అమ్మేటప్పుడు పడే పన్నులు ఎక్కువగా ఉన్నాయని ఇన్వెస్టర్లు చాలాకాలంగా బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎల్టీసీజీ, ఎస్టీటీ తగ్గించాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్చిస్తోందని ఆర్థిక మంత్రి చెప్పడంతో, మున్ముందు పన్ను భారం తగ్గొచ్చనే ఆశతో మార్కెట్ ర్యాలీ చేసింది.
ఐటీ కంపెనీల దన్ను
సాఫ్ట్వేర్ సేవలందించే పెద్ద కంపెనీల సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలను మించాయి. హెచ్‌సీఎల్‌టెక్ , టీసీఎస్ ఏఐ రెవెన్యూలో భారీ వృద్ధి కనిపించింది. ఏఐ ప్రభావం ఐటీ కంపెనీలపై తీవ్రంగా ఉంటుందన్న భయాలు కొంత తగ్గాయి. అయితే మార్కెట్ మంగళవారం భారీగా పెరిగినప్పటికీ రెండు విషయాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) సెప్టెంబర్‌లో 5.54శాతానికి చేరుకుంది. ఇది ఆర్బీఐ పెట్టుకున్న అప్పర్ లిమిట్ 6 శాతం కంటే కాస్త తక్కువ అంతే. దీంతో రెపో రేటు పెరుగుతుందని, కంపెనీల రుణ ఖర్చులు ఎక్కువవుతాయనే భయాలు ఉన్నాయి. దీనికితోడు క్రూడాయిల్ ధర ఇంకా 100 డాలర్లపైనే కదులుతోంది.
