ఇటలీలో చిక్కుకున్న భారత విద్యార్థులు

ఇటలీలో చిక్కుకున్న భారత విద్యార్థులు

కోవిడ్ వైరస్ బారిన పడి ఇటలీలో ఇప్పటివరకు 631 మంది చనిపోయారు. అయితే ఇటలీలో కోవిడ్ 19 వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రభుత్వం వైరస్ నివారణ కోసం చాలా ప్రావిన్స్‌లను మూసివేసింది. దాంతో భారత్‌కు చెందిన వందలాదిమంది తెలుగు విద్యార్థులు ఇటలీలో చిక్కుకున్నారు. కరోనా భయంతో ఇండియాకు పయనమైన తెలుగు విద్యార్థులకు ఎయిర్ పోర్టులో చిక్కులు ఎదురవుతున్నాయి. కరోనా లేనట్లు సర్టిఫికెట్ తేవాలంటూ ఎయిర్ పోర్టు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు తమ బాధను వెలిబుచ్చుతున్నారు. ఇటలీలోని పడోవా, రిమిని, మోడెనా, మిలాన్ మొదలైన పట్టణాలను రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించారు. అంతేకాకుండా.. ఇటలీ ప్రభుత్వం మంగళవారం నుంచి ప్రయాణానికి పరిమితులు కూడా విధించింది. సూపర్ మార్కెట్లలో మాస్కులు కూడా దొరకక అక్కడి తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నుంచి ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. కాగా.. అక్కడి ఆస్పత్రులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని తెలుగు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ లక్షణాలు లేనివారికి కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇటలీ తీరు ఇలా ఉంటే.. భారత ప్రభుత్వ ఎంబసీ అధికారులు కూడా విద్యార్థులు ఇండియా రావాలంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరని అంటున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

తెలంగాణలోని సూర్యపేట జిల్లాలోని కోదాడ‌కు చెందిన గెల్లా బద్రినాద్ ఇటలీలోని బోలోగ్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. అతను మాట్లాడుతూ.. ‘మాకు వైరస్ లక్షణాలు ఏం లేవు. ఇక్కడ మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడం చాలా కష్టం మరియు దానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ దాదాపు 30 మంది చిక్కుకున్నారు’ అని ఆయన అన్నారు.

‘పడోవా విశ్వవిద్యాలయంలో దాదాపు 50 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. మోడెర్నాను రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించారు. ఇక్కడ విజయవాడకు చెందిన అయిదుగురం తెలుగు విద్యార్థులం ఉన్నాం. పడోవా ప్రావిన్స్‌లో బంద్ విధించడంవల్ల మేము భారత్‌కు రాలేకపోతున్నాం. అంతేకాకుండా.. మాకు ఇతర నగరాలకు పోవడానికి కూడా అనుమతులు లేవు’ అని పడోవా యూనివర్సిటీలో అగ్రికల్చర్ చదువుతున్న అనంతపురానికి చెందిన లీలా కృష్ణ చౌదరి తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీ చరణ్ తేజ, మిలాన్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి. అతను విసా పర్మిట్ కోసం అక్కడే ఉంటున్నాడు. ‘బంద్ వల్ల అన్ని షాపులు మూసివేయబడ్డాయి. కిరాణా దుకాణాలతో సహా ఎటువంటి షాపులు ఓపెన్ చేయలేదు. మిలాన్‌లో పరిస్థితి ఇలాగే ఉంటే చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. సూపర్ మార్కెట్లలోకి ఒకేసారి 10 మందికి పైగా వ్యక్తులను అనుమతించడంలేదు. ఇక్కడ సుమారు 100 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఆరోగ్య పరీక్షల విషయానికి వస్తే, ఇక్కడున్న తెలుగువారికి ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉంటే 1500 కు కాల్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఆరోగ్య శిబిరాలు లేవు. వైరస్ చెకప్ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఆంక్షల వల్ల అన్ని సంస్థలు, విజిటింగ్ ప్రదేశాలు, షాపులు ఏప్రిల్ 3 వరకు మూసివేయబడతాయి’ అని శ్రీచరణ్ తేజ తెలిపారు.

ఏపీ.. కృష్ణ జిల్లాలోని మాంటాడా గ్రామానికి చెందిన ప్రశాంత్ చాస్డిల్ బోలోగ్నా విశ్వవిద్యాలయానికి చెందిన రిమిని క్యాంపస్‌లో టూరిజం ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్సీ చదువుతున్నాడు. ‘ఇక్కడ రిమినితో పాటు మరో 11 ప్రావిన్సులను నిర్బంధించారు. వైరస్ వ్యాప్తి పెరుగుతండటంతో విమాన ధరలను పెంచారు. మేం భారత్ రావాలంటే మాకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం. బంద్ వల్ల మేం బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. మా ఇంట్లో అందరూ మా గురించి బాధపడుతున్నారు’ అని ప్రశాంత్ అన్నారు.

For More News..

రైల్వే శాఖ కొత్త రూల్.. ప్రయాణికులపై భారం

సమ్మె చేస్తే జాబ్ నుంచి తీసేయండి

ఏపీ పంపిస్తామన్నా.. తెలంగాణ తీసుకెళ్లట్లేదు..

ఇయర్ ఫోన్స్ కొంటే.. కారు గెలిచారని ఫోన్

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు