టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు మన సైన్యం సిద్ధం.. జట్టులో శాంసన్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌కు చోటు

టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు మన సైన్యం సిద్ధం.. జట్టులో శాంసన్‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌, పంత్‌‌‌‌కు చోటు
  • హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ
  • రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లుగా గిల్‌‌‌‌‌‌‌‌, రింకూ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌17లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ శ్రమకు తగిన గుర్తింపు లభించింది. ఈ ఇద్దరూ టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. కారు యాక్సిడెంట్ నుంచి కోలుకొని వచ్చి ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటుతున్న రిషబ్ పంత్‌‌‌‌‌‌‌‌ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు.

కానీ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్, హిట్టర్ రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు కాకుండా రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో బీసీసీఐ సెక్రటరీ జై షాతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌‌‌‌‌‌‌‌ సమావేశమైన తర్వాత రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన ప్రాథమిక జట్టును బోర్డు ప్రకటించింది. విరాట్ కోహ్లీ ప్లేస్‌‌‌‌‌‌‌‌పై అనేక సందేహాలు, అనుమానాలు వచ్చినప్పటికీ  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో రాణిస్తున్న  అతడిని జట్టులోకి తీసుకున్నారు.  ఇటీవల అంతగా ఫామ్‌‌‌‌‌‌‌‌లో లేనప్పటికీ ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ సారథి హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు.  

సీఎస్కే తరఫున అదరగొడుతున్న హార్డ్ -హిట్టర్ శివం దూబేకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.  దూబే, రింకూ మధ్య పోటీలో సెలెక్టర్లు దూబేకే మొగ్గు చూపారని బోర్డు వర్గాలు తెలిపాయి. రిషప్ పంత్‌‌‌‌‌‌‌‌కు తోడు రెండో కీపర్ స్లాట్ కోసం శాంసన్‌‌‌‌‌‌‌‌తో పాటు కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్, ఇషాన్ కిషన్‌‌‌‌‌‌‌‌ కూడా పోటీ పడ్డారు. అయితే, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌, బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మెప్పిస్తున్న శాంసన్‌‌‌‌‌‌‌‌కే సెలెక్షన్ కమిటీ ఓటు వేసింది.

ఇక, చివరగా గతేడాది ఆగస్టులో ఇండియా తరఫున బరిలోకి దిగిన  లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్ చహల్ తిరిగి టీమ్‌‌‌‌‌‌‌‌లో చోటు దక్కించుకున్నాడు.  ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో తడబడినాసెంచరీతో మళ్లీ ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు.  వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ జూన్ 2న ప్రారంభమవుతుంది. జూన్ 5న న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో జరిగే తమ తొలి గ్రూప్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌తో పోటీపడుతుంది.

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కఠిన నిర్ణయాలు.. పేస్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల ఎంపికపై ప్రశ్నలు!

బ్యాటింగ్‌‌‌‌లో మెప్పించలేక గత రెండు టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరిచిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మెగా ట్రోఫీని అందుకునేందుకు సెలెక్టర్లు, బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ను కాదని దూబేని సెలెక్ట్ చేయడం అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. గతేడాది ఆగస్టులో  అరంగేట్రం చేసినప్పటి నుంచి రింకూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు.

ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కి ముందు ఆడిన 15 ఇంటర్నేషనల్ టీ20ల్లో 176.23 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రేట్ ఉన్న రింకూకు వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో ప్లేస్ ఖాయం అనిపించింది. కానీ, సెలెక్టర్లు మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో దూబే  సిక్స్ -హిట్టింగ్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత ఇచ్చారు.  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌లో విజృంభిస్తున్న దూబే సూపర్ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. ఇక, వికెట్ కీపర్ బ్యాటర్ల ఎంపిక విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ   సెలెక్టర్లు పంత్,  శాంసన్‌‌‌‌‌‌‌‌నే ఎంపిక చేశారు. 2022 చివర్లో ఘోర కారు ప్రమాదం నుంచి కోలుకొని వచ్చిన పంత్‌‌‌‌‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో తన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ విన్నింగ్‌‌‌‌‌‌‌‌ స్కిల్స్‌‌‌‌‌‌‌‌ను నిరూపించుకున్నాడు.

రాజస్తాన్ రాయల్స్ తరఫున టాపార్డర్‌‌‌‌‌‌‌‌లో ఆడుతున్న శాంసన్‌‌‌‌‌‌‌‌ను మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ఎలా ఉపయోగించుకుంటుందనేది  ఆసక్తికరంగా ఉండనుంది. తను తుది జట్టులోకి వస్తే మిడిల్ లేదా లోయర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగాల్సి ఉంటుంది. గత రెండు ఎడిషన్లలో టీమిండియా టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూస పద్ధతిలో ఆడి విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుత  కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాపార్డర్ అలానే ఉన్న నేపథ్యంలో  లెజెండరీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ,  రోహిత్ తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరమాంకంలో ఎలాంటి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తారో చూడాలి. అయితే, యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ రూపంలో టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొంత కొత్తదనం వచ్చింది.

మరోవైపు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సెలెక్టర్లు పాతవాళ్లకే అవకాశం ఇచ్చారు. అయితే, కుల్దీప్‌‌‌‌‌‌‌‌–చహల్ ( కుల్చా) మళ్లీ జోడీ కట్టడం విశేషం. మెగా టోర్నీలో ఇండియా ముందుకుసాగాలంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బాధ్యత ఈ ఇద్దరిదే కానుంది.  స్పిన్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రవీంద్ర జడేజా,  అతని బ్యాకప్‌‌‌‌‌‌‌‌గా అక్షర్ పటేల్‌‌‌‌‌‌‌‌కు ప్లేస్‌‌‌‌‌‌‌‌ లభించింది. పేస్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రాకు తోడుగా సెలెక్టర్లు మహ్మద్ సిరాజ్,  అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయడం కొన్ని ప్రశ్నలకు తావిచ్చింది. సిరాజ్,  అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ ఇద్దరూ ఈ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో నిరాశ పరుస్తున్నారు. ఇక, ఐపీఎల్‌ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, లెఫ్టార్మ్ పేసర్  ఖలీల్ అహ్మద్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లుగా టీమ్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రయాణించనున్నారు.