
పారిస్: కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మరో ఘనత సాధించాడు. ఇండియా నుంచి ఐదేండ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాలో పోటీ పడనున్న ఆటగాడిగా నిలిచాడు. గాయం కారణంగా గతేడాది దూరంగా ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు మే 20 నుంచి జరిగే టోర్నీ ఎంట్రీ లిస్ట్‌లను ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్‌ఎఫ్‌టీ) ప్రకటించింది. ఏటీపీ, డబ్ల్యూటీఏ ర్యాంక్‌ల ఆధారంగా ఎంట్రీలు ఖరారు చేసింది. తన 80వ ర్యాంక్ ఆధారంగా నాగల్ మెయిన్ డ్రా లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. దాంతో 2019లో ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాలో ఆడనున్న ఇండియన్‌గా నిలిచాడు.