సైబర్​ నేరాల అడ్డాగా ఆ రెండు నగరాలు

సైబర్​ నేరాల అడ్డాగా ఆ రెండు నగరాలు
  • 47 శాతం మోసాలతో పాట్నా టాప్
  • 41 శాతం కేసులతో హైదరాబాద్ సెకండ్
  • ఎక్కువ మోసాలు జరుగుతున్నది ఆ నగరాల్లోనే

‘మీకు లాటరీ తగిలింది. కోట్ల రూపాయలు మీ కోసం వెయిటింగ్​. ప్రాసెసింగ్​ ఫీజు పంపితే.. ఆ డబ్బు మీదే’.. ఓ మెయిల్​. దాన్ని క్లిక్​ చేసి లక్షలు పోగొట్టుకున్నోళ్లు ఎంతో మంది.

‘మీ అకౌంట్​లో కొద్ది రోజులుగా ట్రాన్సాక్షన్స్​ ఏవీ జరగట్లేదు. దీంతో మీ అకౌంట్​ బ్లాక్​ అయింది. తిరిగి యాక్టివేట్​ కావాలంటే ఆన్​లైన్​లో చేసుకోండి. ఓటీపీ చెప్పండి’.. ఓ మెసేజ్​. నిజమేనని దాన్ని క్లిక్​ చేసి అన్ని వివరాలు చెప్పేసి పైసలు పోగొట్టుకున్నోళ్లు చాలా మందే.

ఇలాంటి సైబర్​ నేరాలు ఒకటి కాదు.. రెండు కాదు. ఎప్పుడూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఆ సైబర్​ నేరాలకు అడ్డా ఏంటో తెలుసా? టయర్​2 సిటీలేనట. మెట్రో సిటీలతో పోలిస్తే టయర్​2 సిటీల్లోనే ఎక్కువగా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని తేలింది. కే7 కంప్యూటింగ్​ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. సైబర్​ థ్రెట్​ మానిటర్​ (సీటీఎం) పేరిట ఆ కంపెనీ రిపోర్టును విడుదల చేసింది. ఆయా సిటీలన్నీ సైబర్​ నేరగాళ్లకు స్వీట్​ స్పాట్స్​గా ఉన్నాయని పేర్కొంది.

పాట్నాలోనే ఎక్కువ

దేశంలో ఏ సిటీలో లేనంతగా బీహార్​ రాజధాని పాట్నాలోనే ఎక్కువగా సైబర్​ నేరాలు జరుగుతున్నట్టు స్టడీలో తేలింది. 47 శాతం మంది సైబర్​ యూజర్లు సైబర్​ నేరాల బారిన పడుతున్నారు. మెట్రో సిటీలు, వేరే టయర్​2 సిటీలతో పోలిస్తే పాట్నాలోనే ఎక్కువ మంది సైబర్​ నేరాల బారిన పడుతున్నారు. ఆ తర్వాత గౌహతిలో 45 శాతం మంది, లక్నో 44%, భువనేశ్వర్​ 43%, జైపూర్​లో 40 శాతం మంది సైబర్​ దాడులకు బాధితులయ్యారు. దేశంలోని పది మందిలో ముగ్గురు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సార్లు సైబర్​ దాడుల బారిన పడి మోసపోతున్నారని స్టడీ తేల్చింది.

మెట్రోల్లో హైదరాబాద్​ సెకండ్​

ఇక, మెట్రో సిటీల్లో జరిగిన నేరాల్లో చెన్నై టాప్​ ప్లేస్​లో ఉంది. పోయిన క్వార్టర్​ (త్రైమాసికం)తో పోలిస్తే ఇప్పుడు 2 శాతం కేసులు తగ్గినా, 46 శాతం కేసులతో టాప్​లో ఉందని రిపోర్టు వెల్లడించింది. ఈ జాబితాలో 41 శాతం కేసులతో హైదరాబాద్​, కోల్​కతాలు సెకండ్​ ప్లేస్​లో ఉన్నాయి. పోయిన క్వార్టర్​తో పోలిస్తే హైదరాబాద్​లో 2 శాతం కేసులు పెరిగాయి. బెంగళూరులో 39 శాతం, పుణేలో 35 శాతం మంది సైబర్​ నేరగాళ్ల బారిన పడ్డారు. అహ్మదాబాద్​లో 37 శాతం కేసులు నమోదయ్యాయి. 1 శాతం తగ్గింది. ముంబైలో 30 శాతం మంది మోసపోయారు. ఇక, పోయిన త్రైమాసికంతో పోలిస్తే ఢిల్లీలో 6 శాతం కేసులు పెరిగాయి. ఏ మెట్రో సిటీతో పోల్చినా నేరాల పెరుగుదలలో ఢిల్లీనే టాప్​. అక్కడ 34 శాతం మంది సైబర్​ దాడుల బారిన పడ్డారు.

ఇవీ కారణాలు..

వివిధ మొబైల్స్​, సెక్యూరిటీ సిస్టమ్​లోని లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నట్టు రిపోర్టు వెల్లడించింది. విండోస్​, ఐవోస్​ రెండు సిస్టమ్​లలోనూ లోపాలున్నట్టు చెప్పింది. ఐఫోన్​లోని ఐమెసేజ్​, సిరిల్లోని లోపాలు సైబర్​ నేరగాళ్లకు దారులు చూపుతున్నాయని చెప్పింది. ఇక, విండోస్​లోని రిమోట్​ డెస్క్​టాప్​ ప్రొటోకాల్​ కూడా సైబర్​ దాడులకు వల్నరబుల్​గా మారినట్టు చెప్పింది. దాంతో పాటు ఇంటర్నెట్​లోని వర్చువల్​ ప్రైవేట్​ నెట్​వర్క్స్​(వీపీఎన్​) ద్వారా కూడా సైబర్​ నేరగాళ్లు యూజర్ల మొబైళ్లు, కంప్యూటర్లలోకి చొరబడిపోతున్నారని పేర్కొంది.

విండోస్​: దీంట్లో అతిపెద్ద సమస్య యూఎస్​బీ స్టోరేజ్​ డివైజ్​ ఆధారిత మాల్​వేర్​. దాంతో పాటు ట్రోజన్స్, పొటెన్షియల్లీ అన్​వాంటెడ్​ ప్రోగ్రామ్స్​, యాడ్​వేర్, డిసెప్టర్స్​, కాయిన్​మైనర్స్​ వంటివీ దాడులు ఈజీ అయ్యేలా చేస్తున్నాయి.

మొబైల్స్​: మొబైల్స్​లో సైబర్​ ఎటాక్​లకు అతిపెద్ద కారణం యాడ్​వేర్​. కొత్తగా వచ్చిన యాండ్రాయిడ్​ మాల్​వేర్​లూ దాడులకు బాటలు వేస్తున్నాయి.

మ్యాక్​: గతంతో పోలిస్తే ఇప్పుడు మ్యాక్​పైనా ఎటాక్​లు పెరిగిపోయాయి. పీయూపీలు, యాడ్​వేర్​, అవసరం లేని అప్లికేషన్ల ద్వారా సైబర్​ నేరగాళ్లు చొరబడిపోతున్నారు. పీయూపీ కేటగిరీలో యాడ్​వేర్​తో చేస్తున్న దాడుల వాటా 55 శాతం. అవసరం లేని యాప్​ల ద్వారా 42 శాతం, కాయిన్​మైనర్​ ద్వారా మరో 3 శాతం దాడులు జరుగుతున్నాయి.

నేరగాళ్లు అప్ డేట్ అవుతున్నరు

‘‘నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు. ఇది ఇటు కంపెనీలకు, అటు యూజర్లకు పెద్ద ముప్పే తెచ్చి పెడుతుంది. పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో సైబర్ దాడుల ముప్పు మరిం త పొంచి ఉంది. కాబట్టి వచ్చే ఏడాది కంపెనీలకు పెద్ద పరీక్షే. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా కంపెనీలు సైబర్ దాడుల నుంచి రక్షించుకునేలా యూజర్లకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వమూ అవేర్ నెస్ పెంచాలి’’- జే కేశవర్ధనన్ , ఫౌండర్ , సీటీవో, కే7 కంప్యూటింగ్