
మన యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2020లో సత్తా చాటాయి. టాప్ 100లో 11 ఇండియన్ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. మన కంటే ముందు… 30 యూనివర్సిటీలతో చైనా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇక మొత్తంగా ఈ ఏడాదికి గాను 533 యూనివర్సిటీల్లో 56 భారత విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది. నిరుడు ఈ సంఖ్య 49 మాత్రమే. మొత్తం 47 దేశాలకు చెందిన యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను టీహెచ్ఈ మంగళవారం లండన్‌లో వెల్లడించింది. ‘‘వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇండియన్ యూనివర్సిటీలు సక్సెస్ కావడంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ స్కీమ్‌తో సాధ్యమవుతోంది. ఇది భారత్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్‌కు టర్నింగ్ పాయింట్” అని టీహెచ్ఈ ఆఫీసర్ తెలిపారు.
ఎమినెన్స్ స్కీమ్‌తో ఫలితం
భారత్‌లో టాప్ యూనివర్సిటీగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌సైన్స్ (ఐఐఎస్సీ) టీహెచ్ఈ 100లో 16వ స్థానం దక్కించుకోగా, ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీలు నిలిచాయి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ఎమినెన్స్ స్కీమ్ సత్ఫలితాలనిస్తోంది. ఏటికేడు మన యూనివర్సిటీల ర్యాంకింగ్ మెరుగవుతోంది. ఈ స్కీమ్ లో భాగమైన అమృత విశ్వ విద్యాపీఠం తొలిసారి టీహెచ్ఈ టాప్ 100లో స్థానం దక్కించుకుంది. 2019లో 141వ ప్లేస్‌లో నిలిచిన విద్యాపీఠం ఏడాదిలోనే 51 స్థానాలను మెరుగుపరుచుకుంది. ఐఐటీ ఖరగ్ పూర్ 23 స్థానాలు మెరుగుపరుచుకొని 32 స్థానంలో నిలిచింది. ఐఐటీ ఢిల్లీ 28 స్థానాలు జంప్ చేసి 38వ ర్యాంక్, ఐఐటీ మద్రాస్ 12 స్థానాలు పైకి ఎగబాకి 63వ ర్యాంక్ దక్కించుకున్నాయి. ఇక ఐఐటీ రోపార్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఫస్ట్ టైమ్ టీహెచ్ఈ టాప్ 100 లో నిలిచాయి.